Oct 17,2023 00:48
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మూడమంచు వెంకటేశ్వర్లు


ప్రజాశక్తి-సిఎస్‌ పురం: ఉపాధ్యాయులు కోరుకున్నచోట డిప్యుటేషన్‌ వేయడం సరైన పద్ధతి కాదని ఎంపీపీ మూడమంచు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు వారు కోరుకున్న చోటుకు డిప్యుటేషన్లు ఎందుకు వేస్తున్నారని ఎంఈఒను ఎంపీపీ ప్రశ్నించారు. ఏ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందో గుర్తించి ఉపాధ్యాయులను పంపించాలే గాని వారి ఇష్ట ప్రకారం పంపించడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపేట పాఠశాల నుంచి డిప్యూటేషన్‌ మీద ఉపాధ్యాయులను ఎందుకు బదిలీ చేశారని ఎంపీటీసీ మితికాల ప్రభావతి గురవయ్య సభలో ప్రస్తావించగా ఎక్కడి ఉపాధ్యాయులను అక్కడే ఉంచాలని ఎంపీపీ ఆదేశించారు. మారుమూల గ్రామమైన పిల్లిపల్లి నుంచి కోవెలంపాడు పాఠశాలకు ఉపాధ్యాయులను ఎందుకు బదిలీ చేశారని బోయమడుగుల ఎంపీటీసీ సభ్యులు బైరెడ్డి తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. మీ ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు చేసుకుంటూపోతే మారుమూల ప్రాంతాలకు ఉపాధ్యాయులు ఎలా వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకనాపురం గ్రామంలో పాఠశాల స్లాబు పెచ్చులూడి పడిపోతుంటే ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని అరివేముల ఎంపీటీసీ సభ్యులు బి వెంగయ్య సభ దృష్టికి తెచ్చారు. పంచాయతీ ఆఫీసులో పాఠశాల నడుపుతున్నారని, ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. మండలంలో నాడు-నేడు కింద మొదటి విడతగా 26 పాఠశాలల్లో పనులు పూరి అయ్యాయని, రెండో ఫేస్‌ కింద 27 పాఠశాలలు మంజూరై పనులు జరుగుతున్నాయని ఎంఇఓ-2 రాజాల కొండారెడ్డి తెలిపారు. మండలంలోని వి.బైలు గ్రామంలో తాగునీటి సౌకర్యార్థం రూ.60 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ రమేష్‌ తెలిపారు. సి నాగులవరం ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్కేపల్లి ఎంపీటీసీ సభ్యురాలు పాతర లలితమ్మ సభలో ప్రస్తావించారు. జాతీయ పశు ఉత్పాదిత పథకం కింద నిరుద్యోగులకు కోటి రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పశువైద్యాధికారి మునీర్‌ తెలిపారు. 50శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీనిధి కింద మండలంలో 98 గ్రూపులకు రెండు కోట్ల 45 లక్షలు మంజూరు చేసినట్లు వెలుగు ఏపిఎం విద్యాసాగర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రామచంద్రరావు, తహశీల్దార్‌ షేక్‌ నాగుల్‌మీరా, పంచాయతీరాజ్‌ ఎఇ రామకృష్ణ, విద్యుత్‌ ఎఇ మోహన్‌రెడ్డి, ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ దేవకృపావరం, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.