న్యూయార్క్ : యాపిల్ కంపెనీ భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్, ఐపాడ్లలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. యూజర్స్ తమ యాపిల్ ఉత్పత్తులను ఐఫోన్/ఐపాడ్ డిస్ప్లేపై ఉంచి ఛార్జ్ చేసుకోవచ్చట. అంటే ఇక మీదట ఐఫోన్/ఐపాడ్ డిస్ప్లేనే ఛార్జర్‌లా పనిచేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు యాపిల్ కంపెనీ 'థ్రూ-డిస్ప్లే వైర్లెస్ ఛార్జింగ్ (Through-Display Wireless Chareging )' అనే టెక్నాలజీపై పేటెంట్ పొందినట్లు సమాచారం. దీంతో వినియోగదారులు తమ యాపిల్ ఉత్పత్తులను సులువుగా ఛార్జింగ్ చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యూజర్స్ ఈ టెక్నాలజీ సాయంతో ఐఫోన్/ఐపాడ్ ద్వారా ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు ఇతర యాక్సెసరీలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే యాపిల్ డిస్ప్లే వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే సాంకేతికతను కూడా ఆయా డివైజ్‌లలో పరిచయం చేయాల్సి ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఛార్జ్ చేసేందుకు మెగాసేఫ్ ఛార్జర్, బ్యాటరీ ప్యాక్‌లను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో వైర్లెస్ డిస్ప్లే ఛార్జింగ్ టెక్నాలజీ వార్తలు రావడంతో ఐఫోన్ 14లోనే ఈ టెక్నాలజీని పరిచయం చేస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు.










