Oct 28,2023 13:03

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఐ.ఎన్.ఎస్ డేగాలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా ఇన్ చార్జి మంత్రి విడదల రజని పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. ఆంధ్రా వైద్య కళాశాల శతాబ్ది వేడుకలకు ఉప రాష్ట్రపతి ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ఉప రాష్ట్రపతికి  నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జి.సుబద్ర, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహరావు, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమీషనర్ ఎ.రవిశంకర్, జివిఎంసి కమీషనర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైనికుల గౌరవ వందనాన్ని ఉప రాష్ట్రపతి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, విఎంఆర్డిఎ సెక్రటరీ డి.కీర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.