Oct 03,2023 11:47

న్యూఢిల్లీ :   41 మంది దౌత్యవేత్తలను ఈ నెల 10లోగా వెనక్కి పిలవాలని కెనడాను భారత్‌  హెచ్చరించినట్లు జాతీయ మీడియా మంగళవారం పేర్కొంది. ఇటీవల  ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో అక్టోబరు 10లోగా సుమారు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.  కెనడాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే న్యూఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ సంఖ్యను సమస్థాయికి తీసుకురావాలని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం న్యూఢిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యసిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం. అక్టోబర్‌ 10 దాటిన తర్వాత అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను కూడా  తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారంపై కెనడా, భారత్‌ విదేశాంగ శాఖలు స్పందించాల్సి వుంది.