న్యూఢిల్లీ : గత కొద్ది నెలలుగా దేశంలో బియ్యం, టమాటో, ఉల్లిపాయలు, పప్పుధాన్యాల అధిక ధరలతో ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌లో చక్కెర కొరత ఏర్పడనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో చెరకు సాగు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడాయి. మరోవైపు ఏడేళ్లలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చక్కెర ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో తగ్గుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర ఉత్పత్తిలో 14 శాతం తగ్గుదల (నాలుగేళ్లలో కనిష్టం ) ని నమోదు చేసింది.
భారత్‌లో రుతుపవనాలు, బిపోర్‌జారు తుఫాను తీవ్రంగా నిరాశపరిచాయి. ఖరీఫ్‌లోనూ సాగుకు అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలపై దృష్టి పెట్టారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే చక్కెర ధరలు 30 శాతం పెరగడంతో... భారత ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై నిషేధం విధించవచ్చని ముందుగానే అంచనావేశారు. భారత ప్రభుత్వం మరోసారి ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు. టమాటో, ఉల్లిపాయలు, కూరగాయల ధరల స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వ్యవసాయ విధానాలు, సామర్థ్యంపై విమర్శలు వెల్తువెత్తాయి.










