Jul 09,2023 15:22
  • మరింత ఆలస్యం అవుతున్న తొలకరి సాగు
  • శివల, దంగేరు, కుడుపూరు, గుడిగళ్ల రైతులకు తప్పని ఇక్కట్లు
  • స్వంత ఖర్చులతో కాలువతవ్వుకుంటున్న రైతులు
  • పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు.

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఏడాది తొలకరి అనుకున్న సమయానికి సాగవాలని ప్రభుత్వం భావించింది .అందులో భాగంగా జూన్ ఒకటో తేదీన కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి నీటిని విడుదల చేశారు. అయితే శివారు ప్రాంతాలకు ఇప్పటికే నీరు చేరకపోవడంతో తొలకరి పంట మరింత ఆలస్యం అవుతుంది. జూలై రెండవ వారం వచ్చిన కే గంగవరం మండలంలోని పలు ప్రాంతాలకు ఇంకా సాగు నీరు  అందటం లేదు. దీంతో ఇప్పటికే పలువురు రైతులు ఆకుమడులు కూడా వేసుకోలేదు. ముఖ్యంగా శివల, దంగేరు, గుడిగల్ల కుడుపూరు  ప్రాంతాలకు ఇప్పటికే సాగునీరు అందడం లేదు దీంతో సాగు మరింత ఆలస్యం అవుతుంది. ఎర్ర పోతవరం గ్రామం నుండి శివల గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లు పంట కాలవను రోడ్డు ఆధునికరిస్తున్న కాంట్రాక్టర్ ధ్వంసం చేయడంతో ఇక్కడ నీరు అందే పరిస్థితి లేదు దీంతో శివల గ్రామ రైతులంతా సుమారు 50000 రూపాయలు చందాలు వేసుకుని ఆదివారం పంట కాలువ తవ్వించు కున్నారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు పంట కాలువ ఆధునీకరణకు చర్యలు చేపట్టలేదని రోడ్డు కాంట్రాక్టర్ కాలు మట్టంతా తీసివేసారని దీంతో సాగునీరు రావడం లేదని అందుచేత రైతులంతా రూ 50 వేలు చందాలు వేసుకుని ప్రోక్లైనర్ సహాయంతో కాలువను ఆధునికరించినట్లు వారు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు కాలువలు అభివృద్ధిని పట్టించుకోవాలని సరిపడా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో నెల రోజుల వరకు ఈ ప్రాంతాల్లో నాట్లు వేసే పరిస్థితి కనపడటం లేదని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. వేసవిలో పంట కాలువలు, డ్రైనేజీలను ఆధునీకరించకపోవడంతో ప్రస్తుతం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.