ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కే. గంగవరం మండలంలోని కోటిపల్లి వద్ద గోదావరి నీటిమట్టం రెండు అడుగుల మేర పెరిగింది. అక్టోబర్ నుండి జూన్ వరకు నీలిరంగులో ఉండే గోదావరి నది వరదనీరు ప్రవాహంతో ఎర్ర రంగును సంతరించుకుంది. గోదావరి నదికి వరద నీరు రావడంతో ఇక వచ్చే నెల నుండి గోదావరి జిల్లాల ప్రజలకు ఎంతో ఇష్టమైన పులస చేపలు వలస గోదావరి నదికి వస్తుంది. ఎరుపు రంగు నీటికి సముద్రంలోని పులస చేపలు ఈ నీటికి ఆకర్షితమై గోదావరి నదిలో ప్రవేశిస్తుంది. వెయ్యి నుండి 5000 వరకు ధర పలికే పులస చేపలు పడితే మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆశిస్తారు. అదేవిధంగా పులస ప్రియులు ఎంత ధరకైనా పులసలు కొనేందుకు వెనకాడరు. వరద నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో నది పరివాహ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత వరద నీరు పెరిగితే కోటిపల్లి గోదావరి లంకలోకి ఐలాండ్ గ్రామ సేరిలంకలోనికి వరద నీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది.










