ప్రజాశక్తి-యంత్రాంగం
కొద్ది రోజలుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపి తగ్గుముఖం పట్టింది. జలదిగ్బంధంలో ఉన్న లంకలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
రామచంద్రపురం : గోదారమ్మ మంగళవారం ఉదయానికి శాంతించింది. కోటిపల్లి వద్ద గోదావరి ఐదు అడుగులు తగ్గడంతో ఇప్పటివరకు నీట మునిగి ఉన్న ప్రయాణికుల రేవు స్నా ఘట్టాలు బయటపడ్డాయి. కోటిపల్లి వద్ద మత్స్యకారులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంగళవారం నుంచి నిలిపివేశారు. ఐలాండ్ గ్రామం శేరి లంక లోనూ మంగళవారం మండల అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.
నిత్యావసరాలు, బియ్యం అందజేత
మామిడికుదురు : వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పి.గన్నవరం ఎంఎల్‌ఎకొండేటి చిట్టిబాబు అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పెదపట్నంలో 821 కుటుంబాలకు, అప్పనపల్లి లో 1831 కుటుంబాలకు, ఒక్కోక కుటుంబానికి 25 కేజీలు వంతున బియ్యం పంపిణీ చేశారు. నగరం పిహెచ్‌సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపట్నం సర్పంచ్ గుబ్బల దుర్గ, అప్పనపల్లి సర్పంచ్ గడ్డం మంగాలక్ష్మి, వెంకటేశ్వరరావు, బాల బాలాజీ దేవస్థానం చైర్మన్ చిట్టూరి రామకృష్ణ, అప్పనపల్లి ప్రత్యేక అధికారి ఎంఇఒ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. వరద బాధిత కుటుంబాలకు ప్రతీ ఏడాది నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న అంధ దంపతులు దాట్ల సత్యనారాయణ రాజు, విజయకుమారి సేవలు అమూల్యమైనవి అని మండల ఇంఛార్జి తహసిల్దార్ జె.వెంకటేశ్వరి అన్నారు. కాకినాడకు చెందిన అంధ దంపతులు దాట్ల సత్యనారాయణ రాజు, విజయకుమారి సమకూర్చిన కూరగాయలను వరద బాధితులకు అధికారులు అందజేశారు.
అయినవిల్లి : పొట్టిలంక, కొండుకుదురు లంక గ్రామాలలో వరద ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన బియ్యము మరియు నిత్యవసర సరుకులు జెడ్‌పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు, ఎంపిపి మట్టపర్తి నాగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కాట్రేనికోన : వరద బాధితుల ఒక్కో కుటుంబానికి (రేషన్ కార్డు కి) 25 కిలోల రైస్, కిలో ఆయిల్, కిలో కందిపప్పు, కిలో ఉల్లపాయలు, కిలో బంగాళాదుంపలు చొప్పున పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం జరిగిందని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం బియ్యం స్టాక్ రావడం జరిగిందని వీటిని స్థానిక శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జెసిఎస్.నుపూర్ అజరు చేతులు మీదుగా పంపిణీ చేశామన్నారు
ముంపు ప్రాంతాల్లో పర్యటన
ఐ.పోలవరం : కేశనకుర్రు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఒకటవ వార్డు జాంబవాని పేట, పొగాకుల్లంక, చిన్న కేశనకుర్రు మత్స్యకార గ్రామంలో ముంపునకు గురైన ప్రాంతాలో ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జిల్లా జెసి పర్యటించారు.అనంతరం ఎం పి పి మోర్త రాణి మిరియం జ్యోతి సమక్షంలో వరద బాధితులకు ఒక్కొకార్డు దారునికి 25కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.
భోజనం ప్యాకెట్ల పంపిణీ
మామిడికుదురు(పి.గన్నవరం) : వాడ్రేవుపల్లిలో వరద ప్రభావంతో నిరాశ్రుయులైన 200 మంది బాధితులకు సర్పంచ్ పత్తిపాటి ఉమామహేశ్వరి వెంకటేశ్వరరావు మంగళవారం భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
పాడి రైతులకు దాణా ..
ఆలమూరు : వరదల వల్ల ముంపునకు గురైన లంక గ్రామాల్లో పాడి రైతులకు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిన 5 టన్నుల దాణాను ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి పంపిణీ చేశారు. మండలంలోని మూలస్థానం పశువైద్యశాల వద్ద ఆ శాఖ ఏడి డాక్టర్ ఎల్.అనిత అధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కపిలేశ్వరపురం : గోదావరి వరద మంగళవారం తగ్గుముఖం పట్టింది. ధికారు లు లంక గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
వరి పొలాల పరిశీలన
అమలాపురం రూరల్ : పేరూరు గ్రామములో వరదల వలన ముంపుకు గురయిన వరి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసు బాబు మంగళవారం పరిశీలించారు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ దాసరి అరుణ, ఎంపిటిసి సభ్యులు చొల్లంగి సుబ్బరామ్, దొంగ ఆంజనేయులు, ఎఫ్ టి సి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశేఖర తదితరులు పాల్గొన్నారు.










