Jul 28,2023 23:33

ప్రజాశక్తి - యంత్రాంగం
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లంకలను చుట్టుముట్టింది. ఇప్పటికే లంక భూముల్లో పంటలను తనలో కలిపేసుకున్న గోదావరి గ్రామాల్లోకి ఉరకలు తీస్తోంది. గోదావరి ఉగ్రరూపానికి లంకలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఇప్పటికే లోతట్టు గ్రామాలు ముంపునకు గురవ్వడంతో తట్టాబుట్టాతో నిర్వాసితులు ఏటిగట్లను ఆశ్రయిస్తున్నారు. కనీస వసతుల్లేక పిల్లాపాపలతో అష్టకష్టాలు పడుతున్నారు.
రాజోలు : అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ముంపు బారినపడ్డాయి. సఖినేటిపల్లి మండలంలోని అప్పనిరామునిలంక, సఖినేటిపల్లిలంక, కొత్తలంక, టేకిశెట్టిపాలెంలోని కొంతభాగం, మలికిపురం మండలంలోని రామరాజు లంక, బాడవ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. నడుంలోతు నీరు చేరడంతో జనం ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టేకిశెట్టిపాలెంలో నివాసాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ఏటిగట్టుపై గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. నరసాపురం -సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పంటలకు భారీ నష్టం...!
నదీ పరివాహక గ్రామాల పరిధిలో మండలంలో సుమారు మూడు వేల ఎకరాల్లో లాభసాటి పంటలు సాగవుతున్నాయి. వరదలకు ఈ పంటలను దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పలు గ్రామాల్లో కూరగాయ పంటలు పూర్తిగా కుళ్లిపోయాయి. తమలపాకుతో పాటు కూరగాయల పంటలకు ఎకరాకు సుమారు రూ.50 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు.
భయం గుప్పెట్లో తీర ప్రాంతాలు
మామిడికుదురు : మామిడికుదురు మండల పరిధిలో పెదపట్నంలంక, బి.దొడ్డవరం, అప్పనపల్లి, ప్రధాన రహదారి వరద నీటమునడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెదపట్నం, పాశర్లపూడి పల్లవపాలెంలో ఇళ్ల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. అప్పనపల్లి ఇందిరమ్మ కాలనీ నీట మునిగింది.
పి.గన్నవరం మండలంలో 10 లంక గ్రామాలు నీట మునిగాయి. జి.పెదపూడిలంక, ఉడిముడిలంక, అరిగెల వారిపేట, బూరుగులంక వాసులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి లంక, నాగులంక పల్లిపాలెం, వాడ్రేవుపల్లి శివారు చిర్రావారిపేట, మానేపల్లి శివారు పల్లిపాలెం, వెళ్లే శిర్రావారిపేట ప్రధాన రహదారులు నీట మునగడమే కాకుండా నివాసాల వద్దకు నీరు చేరింది.
స్లూయిజ్‌ లీక్‌ లతో పోటెత్తుతున్న వరద
కరకట్టలకు అనుసంధానంగా ఉన్న అవుట్‌ పాల్‌ స్లూయిజ్‌ల నుంచి వరద నీరు పోటీత్తుతుండడంతో కరకట్ట ఎగువనున్న పంట పొలాల్లో నారుమళ్లు నీట మునిగాయి. అధికారులు లోతట్ట ప్రాంతాల వారిని సురక్ష ప్రాంతాలకు తరలిస్తున్నారు. 65 ప్రాంతాల్లో 110 ఆవాసాలు ప్రభావితం అవుతున్నాయని కలెక్టర్‌ హేమాన్స్‌ శుక్లా, ఆర్‌డి వసంత రాయుడు గుర్తించి సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. 32 చోట్ల బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టారు.
ఆత్రేయపురంలో.. లంకల్లో పొలాలను వరద నీరు ముంచెత్తడంతో ఉద్యాన పంటలు వరద నీటిలో నానుతున్నాయి బొప్పాయి, కంద, అరటి, బెండ, బీర, దొండ, పసుపు, పెండలం, మునగ పలు ఉద్యాన పంటలు నీటిలో నానుతున్నాయి. వాడపల్లిలంక, పులసలంకలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి వరద ఉధతి పెరుగుతున్న కారణంగా కార్యదర్శులు అంతా ఆయా గ్రామాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఒ నాతిబుజ్జి ఆదేశించారు. కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
రామచంద్రపురం : గోదావరిలో వరద నీటి ఉధతి కొనసాగుతుంది. కోటిపల్లి వద్ద గోదావరి ప్రవాహం ఉదతంగా ఉండటంతో మరికొన్ని రోజులు రేవు ప్రయాణాలను నిలిపివేయనున్నారు. కోటిపల్లి రేవు పూర్తిగా నీట మునిగింది.
ఐ.పోలవరం : వద్ధ గౌతమి నదికి యానాం -ఎదుర్లంక వారధి వద్ద వరద భారీగా చేరుతుంది. ఐలాండ్‌ను చుట్టు ముట్టింది. ఐలాండ్‌ చుట్టూ ఏటిగట్టు అనుకొని ఉన్న నివాసగ్రామాలు ఎదుర్లంక -రామాలయంపేట, కొమరగిరి -గట్టువారిపేట, కేశనకుర్రు -జాంబవానిపేట, పుగాకులంక, పల్లెగూడెం, జి.మూలపొలం గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మురమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద పూరిపాకలను వరద నీరు తాకింది. ఇక్కడ నివాసం ఉంటున్న వారిని ఖాళీచేయించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎదుర్లంక గోదావరి నదీ పరివాహకంలో సుమారు కిలోమీటర్‌ మేర లంకభూమి గోదావరిలో కలిసి పోయింది. సుమారు 200వందలు కొబ్బరి చెట్లు వరదతో గోదావరిలో కలిసి పోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. అన్నంపల్లి అక్విడేట్‌ వద్ద గోదావరి వరద పోటెత్తింది.
మంత్రులు పర్యటన
అయినవిల్లి : మండలంలో అయినవిల్లిలంక, ఎదురుబిడిం కాజ్‌వేను మంత్రులు జోగి రమేష్‌, పినిపే శిశ్వరూప్‌, ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. వారి వెంట్‌ ఆర్‌డిఒ ముక్కంటి, ఎంపిడిఒ తాడి వెంకటాచార్య, డిటి పి.అశోక్‌ప్రసాద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు ఉన్నారు.
కపిలేశ్వరపురం : మండలంలో తాతపూడి, కపిలేశ్వరపురం కోరుమిల్లి, అద్దంకివార్లంక, పల్లపులంక, నారాయణలంక, కేదార్లంక, వీధి వారి లంక గ్రామాల ప్రజలు వరదతో బెంబలిత్తుతున్నారు. లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. వరద ప్రాంతాలను శుక్రవారం తహశీల్దార్‌ కె.సూర్యారావు, ఎంపిడిఒ ఎం.రామకృష్ణారెడ్డి, హెడ్‌ వర్క్స్‌ ఎఇలు పరిశీలించారు. కోరుమిల్లి శివారులోని లాకుల సమీపంలో అనుమానంగా ఉన్న ఏటి గట్టు ప్రాంతాన్ని ఇసుక బస్తాలతో కప్పించే ఏర్పాట్లు చేపట్టారు.