Aug 02,2023 23:31

ప్రజాశక్తి-యంత్రాంగం
కొద్దిరోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరద బుధవారం తగ్గుముఖం పట్టింది. దీంతో లంకల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వం వరద బాధితులకు కోసం నిత్యావరసరాలను, బియ్యం, కూరగాయలను అందజేస్తోంది. పలుచోట్ల బుధవారం ప్రజాప్రతినిధులు వీటిని వరదబాధితులకు అందజేశారు. వారుమాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.
రామచంద్రపురం : గోదావరి వరద బాధితులకు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో సుమారు 750 బాధిత కుటుంబాల కు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ నూనె, కేజీ బంగాళాదుంపలను మంత్రి చేతుల మీదగా అందజేశారు. అదేవిధంగా ఐలాండ్‌ గ్రామమైన శేరిలంక లోను వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి జగన్‌ వరద బాధిత ప్రాంతాల్లో వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని అన్నారు. వైసిపి నాయకులు రేవు శ్రీను,పెట్ట శ్రీనివాసరావు, బత్తుల అప్పారావు గ్రామ సర్పంచ్‌ పెమ్మాడి బేబీ సత్తిబాబు, తహశీల్దార్‌ వైద్యనాథ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.
రూ.75 వేలు విలువైన పశువుల దాణా పంపిణీ
ఐలాండ్‌ గ్రామమైన శేరిలంకలో వరద ముంపు గురైన పాడి రైతులకు రూ.75 వేలు విలువైన పశువుల దాణాను మంత్రి వేణు అందజేశారు. మొత్తం 81 మంది రైతులకు టిఎంఆర్‌ పశువుల దాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిఒ రామకృష్ణ, మండల పశువైద్యాధికారి ఎం.కృష్ణార్జున, పేకేరు పశువైద్యలు సురేష్‌ బాబు, కాశి, రామరాజు సత్య ప్రసాద్‌, వలి తదితరులు పాల్గొన్నారు.
మామిడికుదురు : వరద ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పెదపట్నం లంకలో 184 కుటుంబాలకు బి. దొడ్డవరంలో 776 ప్రభుత్వం సరఫరా చేసిన ఒక్కొక్క రేషన్‌ కార్డుదారునికి 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్‌ ను బుధవారం ఎంఎల్‌ఎ పంపిణీ చేశారు. బి.దొడ్డవరంలో 60 మంది పాడి రైతులకు ఎండు గడ్డి, దాణా అందించినట్లు సర్పంచు చెల్లుబోయిన రామసుబ్రహ్మణ్యం తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు పట్టిలింగం, పి.వి.ఎస్‌.రాజు ల పర్యవేక్షణలో గ్రామమంతా శానిటేషన్‌ చేపట్టామన్నారు. అప్పనపల్లిలో పంచాయతీ కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, పిఎస్‌విఎస్‌.ప్రసాద్‌ల పర్యవేక్షణలో గ్రామమంతా శానిటేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్‌ గెడ్డం మహాలక్ష్మి తెలిపారు. పెదపట్నంలో కార్యదర్శి తాడి ఏసుబాబు, మొగలికుదురు కార్యదర్శులు పర్యవేక్షణలో శానిటేషన్‌ చేపట్టినట్లు సర్పంచ్‌ గబ్బల దుర్గ నాగేశ్వరరావు తెలిపారు.
వరద సహాయక చర్యల నిమిత్తం సిబ్బంది ఏర్పాటు
అమలాపురం : గోదావరి వరద ఉధృతి మూలంగా జిల్లాలో 10 మండలాలలోని 36 గ్రామాలు, 4,550 కుటుంబాలలోని 10,612 మంది వరద ప్రభావానికి గురి అయ్యారని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వరదల నేపథ్యంలో జిల్లాలో ఒక ఇల్లు దెబ్బ తిందని, కోనసీమ జిల్లాలో 71 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ముందుగా వరద ప్రభావానికి లోనైనా 32 పునరావాస కేంద్రాలను ప్రారంభించి సుమారుగా 81,943 ఆహార ప్యాకెట్లను సరఫరా చేశామన్నారు. సురక్షిత తాగునీరు ప్యాకెట్లు 2,08,000, 20 లీటర్ల సామర్థ్యం గల 22,400 క్యాన్లు ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చేశామన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతా లలో ముంపు బాధితుల ఆరోగ్య భద్రత, పరిరక్షణకై 78 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని పి.గన్నవరం మండలంలో వరద సహాయక చర్యల నిమిత్తం నియమించామన్నారు. అదేవిధంగా నాలుగు ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలను ముమ్మిడివరం, అయినవిల్లి, మామిడి కుదురు సఖినేటిపల్లి మండలాలలో వరద సహాయక చర్యల నిమిత్తం నియమించామన్నారు.