Aug 09,2023 00:15

ప్రజాశక్తి- అమలాపురం
వరద బాధితులందరికీ సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ముంపు గ్రామాలైన ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక, లంక ఆఫ్‌ ఠానేలంక, అయినవిల్లి మండలం కొండుకుదురు లంకల్లో ఆయన మంగళవారం పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కోనసీమ జిల్లాకు హెలీకాఫ్టర్‌లో బయలుదేరారు. ఉదయం 9.40 గంటలకు ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకున్నారు. అక్కడ వరద బాధితులతో సమావేశమయ్యారు. వరదలకు అందిన సాయం, అధికారులు స్పందించిన తీరుపై ఆరా తీశారు. అనంతరం లంక ఆఫ్‌ ఠానేలంక, రామాలయంపేట గ్రామాల్లో కాలినడకన పర్యటించారు. బాధితులను పరామర్శిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం వరద బాధితులతో సమావేశమయ్యారు. వరద ప్రభానికి గురైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని కోరారు. గతంలో పాలకులు పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారన్నారు. తాము అలా కాదన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్లకు వారం రోజులు సమయం ఇచ్చామన్నారు. తానే స్వయంగా వచ్చి బాధితులను కలుస్తానని చెప్పానన్నారు. ఆ మేరకు రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నానని తెలిపారు. పేదలకు సాయం అందించే విషయంలో వెనుకడుగు వేయకూడదని, తక్కువ నష్టం జరిగినా రూ.10వేలు ఇవ్వాల్సిందేనని కలెక్టర్లను ఆదేశించానని తెలిపారు. ఈ సీజన్‌లో నష్టపరిహారం ఆ సీజన్‌లోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్‌బికె రికార్డుల్లో పొందుపరుస్తామని తెలిపారు. పంట నష్టం జరిగితే వెంటనే ఆర్‌బికెలో నమోదు చేయించుకోవాలన్నారు. జాబితాలో ఎవరి పేరైనా లేకుంటే ఆర్‌బికెల్లో ఫిర్యాదు చేయాలన్నారు.
రూ.150 కోట్లతో లంక గ్రామాల్లో రక్షణ గోడ నిర్మాణం
లంక గ్రామాల ప్రజలను వరద నుంచి రక్షించేందుకు రూ.150 కోట్లతో రివెట్‌మెంట్‌ వాల్‌ నిర్మాణం చేపడుతున్నట్లు సిఎం జగన్‌ చెప్పారు. దీని వల్ల నదీకోతను అరికట్టడమే కాకుండా చాలా వరకూ లంకగ్రామాలకు వరద నుంచి రక్షణ లభిస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. రెండు నెలల్లోనే పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారుల వైద్యానికి ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక సాయం అందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవ్వూరు మండలం సీతంపేటకు చెందిన బాలిక లక్ష్మీ రేణుక కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో కుమార్తెకు వైద్యం అందించలేక ఆమె తల్లిదండ్రులు నాగలక్ష్మి, గోవింద్‌ నిస్సాహాయంగా మిగిలారు. అలాగే గోపాలపురం భీమోలుకి చెందిన ఐదేళ్ల చిన్నారి జి.గుబ్బాలయ్య తలస్సేమియాతో బాధపడుతున్నారు. రోజువారీ కూలీలు కావడంతో చిన్నారి వైద్యం చేయించలేకపోతున్నామని తల్లి నాగలక్ష్మి వాపో యిం ది. ఈ మేరకు వారు జిల్లాకు వచ్చిన సిఎంను కలిశారు. బాధలను ఏకరువుపెట్టారు. స్పందిచిన సిఎం వెంటనే ఒక్కొక్కొరికి రూ.లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. సిఎం వెంట హోం మంత్రి తానేటి, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌, తలారి వెంకట్రావు, కలెక్టర్లు హిమాన్షుశుక్లా, డాకర్‌ కె.మాదని పాల్గొన్నారు. సిఎం వెంట మంత్రులు తానేటి వనిత, వేణు, పినిపే విశ్వరూప్‌, జోగి రమేష్‌, ఎంఎల్‌ఎలు కొండేటి చిట్టిబాబు, పొన్నాడ సతీష్‌, చిర్ల జగ్గిరెడ్డి, రాపాక వరప్రసాదరావు, ఎంపీ అను రాధ, ఎంఎల్‌సిలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్య నారాయ ణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, జడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణు గోపాలకృష్ణ, రాష్ట్ర హస్తకళల చైర్మన్‌ కుడిపూడి శైలజ, హిత కారిణి సమాజ చైర్మన్‌ మునికుమారి, జడ్‌పిటిసి గన్న వరపు శ్రీనివాసరావు, కలెక్టర్‌హిమాన్షుశుక్లా తదితరులు పాల్గొన్నారు.