Sep 07,2023 22:45

ప్రజాశక్తి-రామచంద్రపురం
ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆల యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించి ఉచిత టిక్కెట్ల పంపిణీ వివాదాస్పదమైంది. ఆలయ ఏర్పాట్ల తీరుపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి పూజకు అయిదు వేల మందికి ఉచిత టిక్కెట్లు ఇస్తామని ఆలయ ఇఒ ప్రకటించినప్పటికీ కేవలం 1200 టిక్కెట్లు మాత్రమే పంపిణీ చేసి మిగిలినవి లేవని చెప్పడంతో ఉదయం నుండి పడిగాపులు పడిన మహిళలు సాయంత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ అధికారులు తీరును ఎండ గట్టారు. అమ్మవారి పూజ టిక్కెట్ల కోసం ఎంపిపి అంబటి భవాని, ద్రాక్షారామ సర్పంచ్‌ కొత్తపల్లి అరుణ, వెంకటాయపాలెం సర్పంచ్‌ సతీష్‌ కుమారీ, ఎంపిటిసి సభ్యులు మొన్న సత్యవతి, తుమ్మూరి సుబ్బ లక్ష్మి, ఇతర గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాకినాడ, సామర్లకోట, యానాం, వీరవరం, రామచంద్రపురం కుడుపూరు, గుడిగళ్ల వంటి అనేక గ్రామాల నుంచి మహిళలు భీమేశ్వరాలయానికి చేరుకున్నారు వీరం తా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయం వద్ద పడిగాపులు పడ్డారు తీరా సాయంత్రం ఆలయా అధికారులు టిక్కెట్లు లేవని ప్రకటించడంతో వీరంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో తోపులాట చోటుచేసుకుంది పలువురు మహిళలకు కళ్లు తిరిగి పడిపోయారు. కొందరు రాజకీయ నాయకులు టిక్కెట్లను వందల కొద్దిపెట్టుకొని వారి తెలిసినవారికి ఇచ్చుకున్నారని పలువురు బహిరం గంగా విమర్శించారు. వారం రోజులు ముందుగా టిక్కెట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాల్సిన అధికారులు ఒకేరోజు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించి కుమ్ములాట సృష్టించారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏర్పాట్ల నిర్వహణలో అధికారులు విఫలం
రామచంద్రపురం ఎంపిపి అంబటి భవాని టికెట్ల కోసం రాగా తనను కూడా లైన్లో నుంచోవాలని ఆలయ అధికారులు చెప్పటం, కనీసం టికెట్లు అయిపోయాయని చెప్పకపోవడంతో ఆమె తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సాయంత్రం వరకు ఆలయం వద్ద పడిగాపులుపడ్డారు. ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేదని వారికి నచ్చిన వారికి ఇళ్లకు టికెట్లు పంపిణీ చేశారని ఎంతమంది ప్రజలను ముఖ్యంగా మహిళలను ఉదయం నుండి రాత్రి వరకు లైన్‌ లో నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఏర్పాట్లు నిర్వహణ చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని ఆమె విమర్శించారు.