Sep 06,2023 00:14

ప్రజాశక్తి-ముమ్మిడివరం
విఒఎలకు బకాయి జీతాలు లేకుండా నెల నెలా వీరికి జీతాలు ఇచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించాలని జిల్లా ముమ్మిడివరం పీడీ కార్యాలయం ఆఫీస్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలు చేరుకుని మంగళవారం నిరసన తెలియజేశారు. విఒఎ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వెలుగు పీడీ ఆఫీస్‌ వద్ద ధర్నా చేపట్టాలని పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, గుదే దుర్గాప్రసాద్‌ నాయకత్వం వహించారు. ముఖ్యఅతిథిగా పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొని విఒఎల సమస్యలపై మాట్లాడుతూ వీరందరికీ పాతవి 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం కొత్తగా 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏ రంగంలో లేని విధంగా మూడు సంవత్సరాల కాల పరిమితి పెట్టి విధుల నుంచి తొలగించడం, రాజకీయ వేధింపులకు గురి చేయడం తగదు అన్నారు. ప్రభుత్వం పనులు చేసినప్పుడు వీరికి సౌకర్యంగా మొబైల్‌ ఫోన్‌ ఇవ్వకుండా పని చేయమంటే ఏ విధంగా పనిచేయగలరన్నారు. ఒకపక్క నిత్యావస్తువుల విపరీతంగా పెరిగి పోతుంటే రూ.8వేలతో ఏ విధంగా బతుకుతారు అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, గుదే దుర్గాప్రసాద్‌ మాట్లాడారు ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు ఎ.జ్యోతి, కార్య దర్శి పి.వెంకటలక్ష్మి, పి.సంతోషి, సత్య వేణి, తులసి,చిన్నామణి, మహాలక్ష్మి, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు
.