Jul 01,2023 23:23

ప్రజాశక్తి-ముమ్మిడివరం
విద్యుత్‌ చార్జీలు పెంపుదలను నిరసిస్తూ ముమ్మిడివరం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుదే దుర్గాప్రసాద్‌ ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల విద్యుత్‌ బిల్లులు షాక్‌ కొట్టే విధంగా ఉన్నాయని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు చార్జీలు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి ప్రజలకు షాక్‌ ఇస్తున్నాయన్నారు. గత సంవత్సరం కరెంట్‌ బిల్లు చార్జీ పెంచి రూ.1400 కోట్ల భారం మోపిందని అన్నారు. శ్లాబ్‌ లో మార్పు చేశారని గత 15 నుంచి వాడుకున్న కరెంటుకు బిల్లులు కట్టినా మళ్లీ సర్దుబాటు చార్జీపేరుతో జనం నెత్తిమీద తాజాగా రూ.6వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. నాలుగేళ్లలో రూ.25 వేల కోట్ల ప్రజలపై భారం మోపరని అన్నారు. ఈ నెల బిల్లు 2014 సంవత్సరంలో వాడుకున్న కరెంటుకు మళ్ళీ యూనిట్‌కి రూ.20 పైసలు చొప్పున, 2021 మే నెల వాడిన విద్యుత్‌కు యూనిట్‌ కి మరో రూ.20పైసలు చొప్పున, 2023 ఏప్రిల్‌ నెలలో ఉపయోగించిన కరెంటుకు రూ.40 పైసల చొప్పున మొత్తం యూనిట్‌కు రూ.80 పైసలు చొప్పున జనంపై భారం వేశారని మండిపడ్డారు. ఇప్పుడు వరకు రెండేళ్లకు, మూడేళ్లకు కరెంట్‌ చార్జీలు పెంచేవారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు లొంగిపోయి జగన్‌ ప్రభుత్వం ఇక ప్రతి నెల వంటగ్యాస్‌ లాగానే కరెంట్‌ చార్జీలు కూడా పెంచడానికి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సిపిఐ నాయకులు శిలం వెంకటేశ్వరరావు,సిపిఎం ముమ్మిడివరం మండల కార్యదర్శి సకిలే సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్‌ కోతులతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు లేనిపోని భారాలేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం జెఇకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాము బాలయ్య, దొమ్మేటి వీరరాఘవులు, లక్ష్మణరావు, విత్తనాల ఏడుకొండలు, సిపిఐ నాయకులు వనచర్ల విజరు కుమార్‌, పలివేల రాంబాబు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.