Aug 09,2023 00:39

ప్రజాశక్తి-అమలాపురం
జిల్లా కలక్టరేట్‌ వద్ద రెండో రోజు విఆర్‌ఎల అర్ధనగ నిరసన ప్రదర్శన తెలిపారు.తెలంగాణాలో చేసినట్లు విఆర్‌ఎలను ఎపిలో కూడా పర్మినెంట్‌ చేయాలని, తొలగించిన డిఎలు అమలు చేసి, బకాయిలు చెల్లించాలని డిఎ రికవరీ ఆపాలని, నామినీలను విఆర్‌ఎలుగా నియమించాలని, అర్హులైన విఆర్‌ఎలకు గ్రేడ్‌ 1 విఆర్‌ఒలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, చనిపోయిన విఆర్‌ఎ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. విఆర్‌ఎలకు పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద రెండవ రోజూ మంగళవారం అర్ధనగ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గా ప్రసాద్‌ నుకాల బలరాం, సంఘం జిల్లా అధ్యక్షడు వీరభద్రం కార్యదర్శులు సత్యనారాయణ, త్రినాథ్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో జగన్‌ విఆర్‌ఎల ఆందోళనకు హాజరై ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తానని, ప్రభుత్వ పిఆర్‌సి విఆర్‌ఎలకు అమలు చేస్తానని, ప్రమోషన్లు ఇస్తానని వాగ్దానం చేసి నేడు మాట తప్పారని విమర్శించారు. తహశీల్దార్‌ కార్యాలయాలలో విఆర్‌ఎల చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని, సమయం పాలన లేకుండా 24 గంటలు పనులు చేయిస్తున్నారన్నారు. వేతనాలు పెంచాలని అడిగిన సందర్భంలో మీరు పార్ట్‌ టైం వర్కర్లని, మీకు పిఆరిసి వర్తించదని రెండు నాలుకల ధోరణితో ప్రభుత్వ అధికారులు, సిఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్‌ఏల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ 10తరగతి వారికి ఆఫీస్‌ సబార్డినెటర్‌ స్కేల్‌, ఇంటర్‌ చదివినవారిని రికార్డ్‌ అసిస్టెంట్స్‌ స్కేల్‌, డిగ్రీ చదివిన విఆర్‌ఎలను జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ వేతనాలు చెల్లిస్తుంటే, జగన్‌ ప్రభుత్వం విఆర్‌ఎలను కనీసం పట్టించుకోవడంలేదని అన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ ్డ స్పందించి రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి న్యాయమైన డిమాండ్‌ పరిష్కారం చేయాలని లేకపోతే ఆగస్టు 25న చలో విజయవాడ పిలుపునివ్వల్సి వస్తుందని అన్నారు. డిమాండ్లు సాధించుకోవడానికి విఆర్‌ఎలు అందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌, సుబ్బారావు, శాస్త్రి, గంగాధర్‌, పరశురాముడు, సత్యనారాయణ, వెంకటలక్ష్మి, మంగాదేవి, సూర్య కుమారి, విఆర్‌ఎలు పాల్గొన్నారు.