Aug 10,2023 23:20

ప్రజాశక్తి - ఆలమూరు
వైసిపి ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలోని యుటిఎఫ్‌ హోమ్‌ నందు 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అద్దరి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా యుటిఎఫ్‌ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ డిఎలు, 11వ పిఆర్‌సి ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం 12వ పిఆర్‌సి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉపాధ్యాయుల ఐక్యపోరాటంతోనే సమస్యలు పరిష్కరించ బడతాయన్నారు. ప్రభుత్వం విధివిధానాల్లో చిత్తశుద్ధిలేదని అన్నారు. విద్యారంగం నిర్వీర్యం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సమూహమైన ఉద్యమసంఘంతో నడిస్తేనే పరిపూర్ణమైన అనుభవం వస్తుందని అన్నారు. సమూహంలో ఉంటేనే సమాజం విలువలు తెలుస్తాయన్నారు. పలువురు యుటిఎఫ్‌ అంకురార్పణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కషిని వివరించారు. మండలంలో పనిచేసి పదోన్నతి పొందిన గవర్నమెంట్‌ హైస్కూల్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖ అధికారి ఇన్చార్జిగా పనిచేసినటువంటి పదోన్నతి పై మండల విద్యాశాఖ అధికారి-1గా తణుకు వెళ్లిన డి.మురళి సత్యనారాయణకు, చెముడు లంక హై స్కూల్‌ నందు ప్రధానోపాధ్యాయులుగా పని చేసి, కడియం మండలానికి ఎంఇఒ-2గా వెళ్లిన ఏడిద నాగేశ్వరరావును మండలంలో స్కూల్‌ అసిస్టెంట్‌ గా చేస్తూ గెజిటెడ్‌ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారికి, ఎస్‌జిటి నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది వేరే మండలం వెళ్లిన ఉపాధ్యాయులను ఎంఎల్‌సి ఐవి సమక్షంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్‌ నేత కెవిఆర్‌.బాపూజీ, యుటిఎఫ్‌్‌ నాయకులు వైవివి.రమణ, అడపా శ్రీనివాసరావు, పివివిజిఎస్‌ఎన్‌.మూర్తి, గౌరవ అధ్యక్షుడు జి.భాస్కర్రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు బి.లోకేష్‌, మహిళా అధ్యక్షురాలు సిహెచ్‌ ఎస్‌వి జి.శ్యామల, ప్రధాన కార్యదర్శి జె.మనోజ్‌ కుమార్‌,ట్రెజరర్‌ పివిఎస్‌.చంద్రమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.