ప్రజాశక్తి-యంత్రాంగం
గోదావరికి వరద ఉధృతి పెరగడంతో గురువారం ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లా లంక గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. వరద ప్రభావం ఎలా ఉం టుందోనని భయభ్రాంతులకుగురువుతున్నారు. భయంగుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
రాజోలు వశిష్ఠ గోదావరికి వరద ప్రభావం మళ్లీ పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 45 అడుగులు దాటడంతో బుధవారం 10 లక్షల క్యూసెక్కులకు పైగా కిందికి వదిలారు. ధవళేశ్వరం మీదుగా వరద నీరు దిగువకు రావడంతో గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని నది పరీవాహక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లోకి పూర్తిగా వరద నీరు చేరకపోయినా ఇప్పటికే లంక గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. వీటితో పాటు ఉభయ గోదావరి జిల్లాల సఖినేటిపల్లి- నరసాపురం రేవు లోకి వరద నీరు పొటెత్తడంతో పంటు ప్రయాణం నిలిపివేశారు. రామచంద్రపురం గోదావరి నదికి వరద నీరు ప్రవాహ వేగం పెరగడంతో గురువారం సాయంత్రానికి మరింత ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకు వరద గోదావరి పెరుగుతూ నిండుకుండలా ప్రవహిస్తోంది. ఇప్పటికే లంకల్లోని పంటలు నీట మునగగా తీర ప్రాంతాల్లో గల లంక గ్రామాలు ఐలాండ్ గ్రామమైన శేరిలంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటు భయంతో ఏ క్షణం ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కోటిపల్లి ప్రయాణికులు రేపు వద్ద గల స్నాన ఘట్టాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రావులపాలెం గోదావరికి వరద ఉధృతికారణంగా లంకలు, లంక పొలాలు నీట మును గుతున్నాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు నేరుగా లంక ప్రాంతాల్లో పర్యటించి పశువులను మెట్ట ప్రాంతాలకు తరలించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో పొలాలు లేని రైతులు ఏటిగట్ల పైకి పశువులను తరలించుకుంటున్నారు. ఆలమూరు గోదారమ్మ వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. లంక భూములను ముంచెత్తుతోంది. ఈ క్రమంలో మూలస్థానం నుంచి తోకలంక వెళ్లే రహదారిపై వరదనీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నదికి వరద ముంపు అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రావులపాలెం సిఐ ఎన్.రజినికుమార్, ఆలమూరుఎస్‌ఐ ఎస్.శివప్రసాద్ తెలిపారు. జొన్నాడ, మూలస్థాన అగ్రహారం, బడుగువానిలంక వరద ప్రభావిత ప్రాంతాలను వారు పరిశీలించారు. గోదావరికి పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలమూరు తహశీల్దార్ ఐపి.శెట్టి, ఎంపిడిఒ జాన్ లింకన్ అన్నారు. వరద పరివాహక ప్రాంతాలను వారు పరిశీలించారు. అయినవిల్లి భారీ వర్షాలకు ఉధృతంగా గోదావరికి వరద పోటెత్తడంతో అయినవిల్లిలంక కాజ్‌వే నీట మునిగింది. దీంతో అయినవిలంక, వీరవెల్లిపాలెం, అద్దంకి వారి లంక వెళ్లే గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పి. గన్నవరం నియోజకవర్గం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పరిశీలించి ప్రజలకు ఎటువంటి అసౌకర్య ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమలాపురం జిల్లాలోని అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో బోడసకుర్రు పల్లిపాలెం రేవు వద్ద గోదావరి వరద ప్రస్తుత పరిస్థితి ఎంపిటిసి సభ్యురాలు బి.పద్మ, మండల స్థాయి అధికారులు ఎంపిడిఒ కష్ణమోహన్, తహశీల్దార్ ప్రసాద్ తదితరులు కలిసి పరిశీలించడమైనది. మామిడికుదురు జిల్లాలో వైనతేయ వశిష్ట గౌతమి వద్ద గౌతమి నదీపాయలలో వరద పోటు పెరుగుతూ ఉండడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు పెదపట్నం లంక ,బీ దొడ్డవరం అప్పనపల్లి వెళ్లే రహదారిలో వరదనీరు చేరడంతో ఇరువైపులా కర్రలు పాతి రక్షణ ఏర్పాటు చేశారు. కనకాయ లంక వద్ద కాజ్వే ఆరు రోజుల నుంచి ముంపులోనే ఉంది. బూరుగులంక, జి.పెదపూడిలంక, ఉడిమూడి లంక అరిగెల వారి పేట గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.కపిలేశ్వరపురం మండలంలోని లంక గ్రామాలైన అద్దంకివార్లంక, పల్లపులంక, నారాయణలంక, కేదార్లంక, వీధి వారి లంక గ్రామాల్లో వరద ప్రాంతాలను అధికారులు పరిశీలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వరద ఉధృతి దష్ట్యా కోనసీమ జిల్లాలో నది తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలకు ప్రాధాన్యత
వరద ప్రభావిత నదీ తీర గ్రామాలలో వైద్య సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర అన్నారు. పి.గన్నవరం మండలం పెదపూడి లంక, ఉడిమూడి లంక,బూరుగులంక, గ్రామాలలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను గురువారం ఆయన సందర్శించారు










