ప్రజాశక్తి-నల్లజర్ల
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బల వద్ద ఏర్పాటుచేసిన క్యాంపు నుంచి 9.45 గంటలకు మొదలైంది. సుమారు 11 గంటలకు పోతవరం చేరింది. తొలుత పోతవరం శివారున, నియోజకవర్గ ప్రారంభంలో. ముళ్ళపూడి దొరాజి, కరుటూరి రవితేజలు నారా లోకేష్ కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కవులూరు గ్రామంలో మాజీ సర్పంచులు బేతన వాణి, సత్యనారాయణ. ఆధ్వర్యంలో ఊరంతా రెడ్ కార్పెట్ పరిచి పూలు చల్లి లోకేష్ కు స్వాగతం పలికారు. దుప్పికుంట కాలనీ వద్ద కనిపించిన చిన్న పిల్లలను ఆయన ముద్దు పెట్టుకున్నారు ఈ సందర్భంగా మహిళలతో ఆయన మాట్లాడారు. అనంతరం చీపురుగుడెంలో జాతీయ రహదారిపై పడివున్న గోతులలో వరినాట్లు వేశారు. తిమ్మన్నపాలెంలో కాంట్రాక్టు ఉపాధ్యా యులు తమ గోడును వివరిస్తూ వినతి పత్రాన్ని లోకేష్ అందించారు. మధ్యాహ్నం నల్లజర్ల శివారులో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పాదయాత్ర చేరుకుంది. విరామం అనంతరం నాలుగున్నర గంటలకు గౌడ కులస్తులతో, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులతో లోకేష్ సమావేశం అయ్యా రు. అనంతరం పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి మద్దిపాటి వెంకటరాజు, జెడ్‌పి మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి కార్యకర్తల సంక్షేమ విభాగ కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్, మండల నాయకులు పసుమర్తి రతీష్ యద్దనపూడి బ్రహ్మరాజు, యలమాటి శ్రీనివాసరావు మాజీ మండల అధ్యక్షులు జమ్ముల వీర వెంకట సతీష్, మండల పార్టీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నల్లజర్లలో కల్లుగీత కార్మికులతో లోకేష్ సమావేశం
ప్రమాదకరమైన వృత్తి చేస్తున్నాం. నిత్యం ప్రమాదాల పాలు అవుతున్నాం.. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత సాయం, బీమా అందడం లేదు.. పని లేని సమయంలో కల్లు గీతకార్మికులకు సహాయం అందించాలని లిక్కర్ షాపుల్లో మాకు హక్కు కల్పించాలి.. కనీసం 20 శాతం షాపులు మాకు కేటాయించాలి.. బిసిలని అనేక కేసులు పెట్టి వైసిపి ప్రభుత్వం వేధిస్తోందని కల్లుగీత కార్మికులు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.
బిసిలకు పుట్టినిల్లు టిడిపి
ఈ సందర్భంగ లోకేష్ మాట్లాడుతూ బిసిలకు పుట్టినిల్లు టిడిపి అని అన్నారు. బిసిలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్య్రం ఇచ్చింది తమ పార్టీయేనని అన్నారు. ఎన్‌టిఆర్ బిసిలకు 24 శాతం రిజర్వేషన్లు, చంద్రబాబు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. దేవేందర్ గౌడ్‌ను ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిని చేసిన ఘనత టిడిపిదేనని అన్నారు. నవ్యాంధ్రలో కెఇ కృష్ణ మూర్తిని ఉప ముఖ్య మంత్రి చేశామన్నారు. కల్లు గీత కార్మికుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసింది తమ పార్టీయేనని చెప్పారు. రూ.105 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆదరణ పథకంలో భాగంగా పనిముట్లు, టూ వీలర్లు అందజేశామన్నారు. తాటి చెట్లు పెంచడానికి సహకారం అందించింది, ప్రభుత్వం.కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది, కల్లు గీత కార్మికుల కోసం బీమా అమలు చేసింది టిడిపియేనని అన్నారు. 50 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల వరకూ రుణాలు అందజేసింది గత టిడిపి ప్రభుత్వమే. కానీ మీరు ఏం చేశారు? పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు అని అంటూ జగన్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం అయినా ఇచ్చాడా? ఒక్క టూ వీలర్ ఇచ్చాడా? మీకు పనిముట్లు అందజేశారా? 26 వేల మంది బిసిలపై అక్రమ కేసులు జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. బిసి నాయకుల పై కేసులు పెట్టి వేధించారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా టిడిపి ప్రభుత్వమే భరిస్తుందన్నారు. టిడిపి హయాంలో బీమా పక్కగా అమలు చేశామని, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వెంటనే ఆదుకున్నామన్నారు. మత్స్యకారులకు ఎలా అయితే వేట విరామం సమయం లో సహాయం అందిం చామో అలాగే కల్లు గీత కార్మికులకు పని లేని సమయంలో సహాయం అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో శెట్టిబలిజ సాధికారక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కుడిపూడి సత్తిబాబు డైరెక్టర్ సొల్లంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలంలో వేలాదిమంది జన సమూహంతో కొనసాగిన లోకేష్ యువ గళం పాదయాత్ర సాయంత్రం ఐదు గంటల నుండి నల్లజర్ల నుంచి ప్రకాష్ రావు పాలెం మీదుగా శుక్రవారం రాత్రి ఆవు పాడు గ్రామ శివారుకు చేరుకుంది రాత్రి బస అనంతరం తిరిగి శనివారం ఉదయం బయలుదేరి ఆవు పాడు మీదగా సింగరాజుపాలెం నుంచి ఏలూరు జిల్లా ఉంగుటూరు చేరుకోనుంది.










