ప్రజాశక్తి-అమలాపురం
వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే రాష్ట్ర ప్రజల భవిష్యతకు గ్యారంటీ ఉంటుందని, జగన్‌ను చిత్తుగా ఓడించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన అమలాపురంలో పర్యటించారు. తొలుత సత్యనారాయణ గార్డెన్స్‌లో రైతులు, వైద్యులు, న్యాయవాదులు, మేధావులు, మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వారి నుంచి రాష్ట్ర అభివృద్ధికి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం నల్లచెరువు నుంచి గడియారస్తంభం సెంటర్ వరకూ రోడ్ షో నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు కేంద్రం వద్దకు వెళ్లి తానే మెడ వచ్చే పరిస్థితికి వచ్చాడన్నారు. అధికారం కోసం తల్లిని, చెల్లిని కూడా వాడుకున్నారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైసిపి ఎంపీలు పార్లమెంట్‌లో నోరు విప్పిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో ఇసుకాసురులు ఎక్కువ అయ్యారని, సామన్యులకు ఇసుక దొరికే పరిస్థితి లేదన్నారు. అమలాపురంలో యానాం-ఎదురులంక వారిధి, ఆర్‌డిఒ కార్యా లయం, కలెక్టరేట్ భవనం ఇవన్నీ టిడిపి హయాంలో మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి అభివృద్ధి చేసినవేనని గుర్తు చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమలాపురానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, పెట్రో ఉత్పత్తులను సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. విద్యుత్, ఆర్‌టిసి ఛార్జీలు, చెత్త పన్నులతో ప్రజలపై వైసిపి సర్కారు పెనుభారం మోపిందన్నారు. అధికారంలోకొస్తే రూ.3వేలు పింఛను ఇస్తానని సిఎం జగన్ ఏడాదికి రూ.250 మాత్రమే పెంచుతూ మోస ం చేశారన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను నమ్మించి నట్టేట ముంచాడన్నారు. రోడ్లపై ప్రయాణించాలంటే భయమే స్తుందన్నారు. కోనసీమలో కొబ్బరి రైతుల పరిస్థితి దారుణంగా ఉంద న్నారు. తాము అధికారంలోకొచ్చిన వెంటనే కొబ్బరి రైతుకు పూర్వ వైభవం కల్పిస్తామన్నారు. ఒక కోడిగుడ్డు, ఒక నిమ్మకాయ, ఒక జామ కాయకు ఉన్న రేటు కొబ్బరికాయకు లేదన్నారు. అమలాపురంలో ఎన్న డూ లేనివిధంగా గంజాయిఅమ్మకాలు ఆందోళన కలిగిస్తు న్నాయన్నారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంపద సృష్టించడం ద్వారా పేదరికం లేని సమాజం కోసం టిడిపి పాటుపడుతుందన్నారు. మహిళకు ప్రాధాన్యత ఇచ్చింది టిడిపియేనన్నారు. మహిళలు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళ యూనివర్సిటీలో వంటివి ఏర్పాటు చేసింది టిడిపి హయాంలోనే అని గుర్తు చేవారు. డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు తాము అధికారంలోకి వస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. గంజాయిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. జగన్ ప్రభుత్వం అంగన్‌వాడి వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలోనూ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. జగన్ ట్యాక్స్‌లతో ఆక్వారంగం నిర్వీర్యమైందన్నారు. అధికార, పోలీస్ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని రౌడీయిజం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు, స్థానిక సత్యనారాయణ గార్డెన్ నుంచి గడియార స్తంభం సెంటర్ బహిరంగ సభకు బయలుదేరిన చంద్రబాబు మార్గమధ్యలో జిఎంసి బాలయోగి ఘాట్‌ను సందర్శించారు. బాలయోగి విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ అయితాబత్తుల ఆనందరావు, టిడిపి అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి గంటి హరీష్‌మాథూర్ తదితరులు పాల్గొన్నారు.










