Sep 12,2023 23:34

ప్రజాశక్తి-అంబాజీపేట
మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలను పరిష్కారించాలంటూ పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. పుల్లేటికుర్రు సర్పంచ్‌ జల్లి బాలరాజు, ఎంపిటిసి సమాఖ్య అధ్యక్షులు ప్రశాంత్‌ లు మాట్లాడుతూ నూతన పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో ఫోటో కాల్‌ విస్మరించి వైసిపి నాయకులతో పంపిణీ చేస్తున్న తీరుపై ఎంపిడిఓ కె.సత్యనారాయణమూర్తి కి ఫిర్యాదులు చేశారు. జల జీవన మిషన్‌ పథకం ద్వారా పనులు మండల పరిధిలో ఎక్కడా పూర్తి కాలేదని మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారని, వెటర్నరీఅసిస్టెంట్‌ ఉన్నా ఉపయోగం లేదని పశువులకు సదుపాయాలు లేక పాడిరైతులు అవస్థలు పడుతున్నారన్నారు. మండల పరిధిలో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు పెరిగిపోయాయని వాకలగరువు, తొండవరం గ్రామాల ఎంపిటీసి సభ్యుడు వాకపల్లి కాశీ విశ్వనాథం అన్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై దష్టి సారించి చర్యలు తీసుకోవాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదని సమావేశ సభలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పుల్లేటికుర్రు వీవర్స్‌ కాలనీ కి వెళ్ళే మార్గంలో మద్యం షాపు వల్ల, మందు బాబులు వల్ల కాలనీ వాసులు, మహిళలు అవస్థలు పడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని, 9 నెలలు కావస్తున్నా ద్వాక్రా గ్రూపు మీటింగ్‌ పెట్టడంలేదని సర్పంచ్‌ బాలరాజు సంబందిత అధికారులు వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డ్‌ సమస్య తో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ప్రజలు వ్యాధులు బారిన పడతున్నారని దీనిపై చర్యలు చేపట్టాలని మాచవరం సర్పంచ్‌ నాగాబత్తుల శాంతా కుమారి ఈ సమస్యను మరోసారి ఎంపిడిఒ దృష్టి కి తెచ్చారు. పలువురు సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యలు అధికారులు దష్టి కి తీసుకెళ్ళి పరిష్కారించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు సమస్యల పై దృష్టి సారించి పరిష్కారానికి చూస్తామని ఎంపిడిఒ అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యురాలు బూడిద వరలక్ష్మి, వైస్‌ ఎంపిపి లు ఎన్‌. నాగరాజు, సుదాబత్తుల లక్ష్మి భార్గవి, సర్పంచ్‌ లు, ఎంపిటీసి లు, అధికారులు పాల్గొన్నారు.