ప్రజాశక్తి-అమలాపురం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభించారు. సోమవారం, మంగళవారం 36 గంటలు నిరవధిక దీక్ష చేపట్టినట్లు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 3000 మంది పైగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. రెండు రోజులు వంట వార్పు కూడా దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. యూనియన్ జిల్లా నాయకులు కృష్ణవేణి, సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్, బలరామ్ మాట్లాడారు. ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలని, అంగన్‌వాడీలకు తెలంగాణలో కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లయినా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించలేదని, ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు అనేక రెట్లు పెరిగాయి, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు నయా పైసా కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో అనేక పోరాటాలు ఫలితంగా వర్కర్లకు 1500, ఆయాలకు 750రూ పెంచుతున్నావని ప్రకటన చేసి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. 2015 నుండి టిఎ బిల్లులో ఇవ్వడం లేదని 2022 ఏప్రిల్ 25న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అంగన్‌వాడీలు 1972 చట్ట ప్రకారం గ్రాడ్యుటీకి అర్హులని తెలియజేసిందన్నారు. కానీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. లబ్ధిదారులను కుదించడానికి పోషణ ట్రాక్ యాప్‌లను తీసుకు వచ్చి ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా రకరకాల యాప్‌ల పేరుతో పనిభారం పెంచారు తప్ప వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఆర్‌టిసి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులడు బి.శ్రీనివాస్‌రావు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భాస్కరరావు నరేంద్ర, ప్రాజెక్ట్ నాయకులు బేబీ గంగారత్నం, సుజాత, వెంకటలక్ష్మి, రాణి, ఆదిలక్ష్మి, దుర్గమ్మ, బి.వెంకటలక్ష్మి, బేబీ పాల్గొన్నారు.










