ప్రజాశక్తి-అమలాపురం
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్‌ఎలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియూ జిల్లా కార్యదర్శిలు బలరాం దుర్గాప్రసాద్ మద్దతు తెలిపారు. విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరభద్రం మాట్లాడుతూ విఆర్‌ఎల సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని విజయవాడ అలంకార్ సెంటర్ నందు నిరసన చేసి ప్రభుత్వానికి మా సమస్యలను తెలిపి తమ న్యాయమైన డిమాండ్లను తెలియజేసి పరిష్కారం చూపమని కోరుటకు వెళ్లగా ప్రభుత్వం విఆర్‌ఎలను నిరసన తెలియజేయనివ్వకుండా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తు పోలీసులతో అక్రమంగా మా విఆర్‌ఎలను అరెస్టులు చేయించి, నాయకులపై దుర్మార్గంగా కేసులు పెట్టించడం జరిగిందన్నారు. విఆర్‌ఎ గా విధులు నిర్వహిస్తూ 10 నుంచి 15 ఏళ్ల సర్వీసు ఉన్న విఆర్‌ఎలను గత ప్రభుత్వాలు విఆర్‌ఒలుగా ప్రమోషన్ ఇస్తూ పే స్కేల్ ను అమలుచేయగా ఈ ప్రభుత్వం వచ్చాక రూ.15వేలు మాత్రమే ఇస్తూ గ్రేడ్-2 విఆర్‌ఒ అని మార్చి మా సర్వీసును, మా భవిష్యత్తును నాశనం చేసిందని అన్నారు. ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న విఆర్‌ఎ లకు ఎటువంటి న్యాయం ప్రభుత్వం చేయలేదని, ఈ విషయాలపై మా సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర విఆర్‌ఎ ల సంఘం జగనన్నకు మన సమస్యలు నేరుగా చెబుదాం అని నిరసన చేయుటకు అనుమతి తీసుకుని వెళ్లిన మాపై అన్యాయంగా అప్పటికప్పుడు పర్మిషన్ రద్దు చేసి అక్రమంగా అరెస్టులు చేశారని అన్నారు. ప్రభుత్వం చేసిన ఇటువంటి చర్యలను ఖండిస్తూ మా న్యాయమైన డిమాండ్ లను నెరవేర్చాలని తెలుపుచు ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేస్తున్నామని తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ విఆర్‌ఎ లకు తెలంగాణ మాదిరి పేస్కెల్ ను అమలు చేయాలని నామిని విఆర్‌ఎ లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన విఆర్‌ఎ లకుప్రమోషన్లు ఇవ్వాలని విజయాలకు కనీస వేతనమైన రూ.26 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల జిల్లా కార్యదర్శి వీరభద్రం, అమలాపురం డివిజన్ అధ్యక్షులు త్రినాథ్, కొత్తపేట డివిజన్ అధ్యక్షులు బాలు, రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు నాగేశ్వరరావు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పరశురాముడు, సుబ్బారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్, నూకల బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










