Aug 20,2023 23:32

ప్రజాశక్తి-అమలాపురం
డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో దాదాపు 700 మంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్నారు. విఆర్‌ఎలు గ్రామంలో తిరుగుతూ భూమి శిస్తు, నీటి పన్ను వసూలుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు సహాయపడేవారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం మాపై పని వత్తిడి పెంచారని విఆర్‌ఎలు ఆవేదన వ్యక్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్లు నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు.
ప్రధాన డిమాండ్స్‌ ఇవే.
గ్రామ రెవెన్యూ సహాయకులకు రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు దీక్ష కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ గ్రామ సహాయకులకు రూ.26,000 వేతనం ఇవ్వడంతో పాటు 65 సంవత్సరాలు దాటిన గ్రామ సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి అతని ఉద్యోగం ఇవ్వాలన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక గ్రామ రెవెన్యూ సహాయకుల డిఎ నిలిపివేశారన్నారు. కొత్త డిఎ తో కూడుకున్న వేతనం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ గ్రామ సహాయకులుగా నియమించాలని, అందరికీ ప్రమోష ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప డిమాండ్లు నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ సహాయకులుడిమాండ్‌ చేశారు.
పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు
ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ 1984లో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ప్రభుత్వాలు మారే కొద్ది రెవెన్యూ వ్యవస్థలో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. 1992లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనల మేరకు విలేజ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(విఎఒ) వ్యవస్థను తీసుకువచ్చింది. కొంత గౌరవ వేతనంలో గ్రామస్థాయిలో తిరిగి విఎఒను నియమించారు. ఇదీ ఎక్కువ కాలం కొనసాగలేదు. తదనంతర కాలంలో వారినే విఆర్‌ఒలుగా నియమించి రెవెన్యూ సేవల్లో కొనసాగించారు. వీరికి సహాయకులుగా విఆర్‌ఎల నియామకం చేపట్టారు. గతంలో కాందార్లు(మస్కూర్లు)గా కొనసాగిన వారిని ఎక్కువగా తీసుకున్నారు. వీరితోపాటు ప్రత్యేకంగా నియామక పరీక్ష నిర్వహించి మరికొందరిని విఆర్‌ఎలుగా తీసుకున్నారు.
ఫేస్‌ యాప్‌ నిబంధన మినహాయించాలని వినతి
ప్రభుత్వం తీసుకువచ్చిన ఫేస్‌ యాప్‌ నిబంధన మినహాయించాలని అర్హత కలిగిన విఆర్‌ఎలకు విఆర్‌ఒలుగా, అటెండర్లుగా, వాచ్మెన్‌గా, డ్రైవర్లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫేస్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలనే నూతన పద్ధతి పెట్టిందనీ దీని వలన విఆర్‌ఎు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విఆర్‌ఎల్లో ఎక్కువ మంది వయస్సు రీత్యా గ్రామ సచివాలయాలకు, తహశీల్దార్‌ వారి కార్యాలయములకు వచ్చి ఫేస్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసే పరిస్థితి లేదనీ గ్రామ సచివాలయాలకు, తహశీల్దార్‌ వారి కార్యాలయములకు దూరంగా ఆవాస గ్రామాలలో విఆర్‌ఎలు వుంటున్నారనీ వారు తెలిపారు.