Sep 11,2023 23:59

ప్రజాశక్తి - రామచంద్రపురం
బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సొంత నియోజకవర్గంలో మెయిన్‌ రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళిఅక్కడ అన్నట్లు ఉంది. మూడు నెలలు క్రితం మార్చి 28న స్వయానా మంత్రి చేతుల మీదగా ద్రాక్షారమ, రామచంద్రపురం మెయిన్‌ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి అట్టహాసంగా పనులు ప్రారంభించారు. మూడు నెలలు గడిచిన మూడు అడుగుల రోడ్డు కూడా వేయకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిత్యం ఈ రోడ్ల దుస్థితిని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లుగా ద్రాక్షారామ రామచంద్రపురం రోడ్డు ద్రాక్షారామ యానం రోడ్డు, ఆదివారపుపేట, వెల్ల రోడ్డు, పేకేరుబి నల్లచెరువు పుంత రోడ్డు, దంగేరు ,శివల రోడ్లు పూర్తిగా పాడై ఉన్నాయి. ద్రాక్షారామ రాష్ట్ర ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి వారి ఆలయం ఉండటంతో నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ గ్రామానికి రామచంద్రపురం నుండి ద్రాక్షారం ఆరు కిలోమీటర్లు ద్రాక్షారం నుండి యానం 18 కిలోమీటర్లు మేర రోడ్డు పూర్తిగా పాడై ఉంది గత ఏడాది నుండి ఈ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని చెప్పడమే కానీ పనులు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది మార్చి 28న మంత్రి తన అనుచరులతో పాటు ప్రజాప్రతినిధులతో ద్రాక్షారంలో అట్టహాసంగా రోడ్డు పనులను ప్రారంభించారు వైసిపి నాయకులు అభిమానులు సర్పంచులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు నెలలు గడిచిన ఈ రోడ్డు పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద గోతుల్లో పడి పలువురు ప్రమాదాలకు గురవుతుండగా ఇటీవల ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి సొంత నియోజకవర్గం లోని రోడ్లన్నీ పాడైపోవడంతో పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. మరో ఎనిమిది నెలల్లో పదవులు పూర్తి ఐయిపోయినా, రోడ్డు పనులు మాత్రం పూర్తయ్యాలా లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా ద్రాక్షరామనుండి యానాం రోడ్డును పలుచోట్ల తవ్వి వదిలేయడంతో మరింత ప్రమాద భరితంగా తయారైంది. వర్షాకాలంలో ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ధైర్యవంతులకు ఒక సాహసంగా తయారయింది. నిత్యం రోడ్లపై ప్రయాణించే మంత్రి అనుచర గణం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరించడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ల దుస్థితి చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా ఉందని, ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ మెయిన్‌ రోడ్లను ఆధునికీకరించాలని ద్రాక్షారామ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.