Aug 17,2023 00:38

ప్రజాశక్తి - మండపేట రాష్ట్రంలో ప్రజలెవర్వరూ సంతోషంగా లేదరని, జగన్‌ది చేతగాని ప్రభుత్వమని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలంలో ఆయన పర్యటించారు. తొలుత ఏడిదలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండపేట కలువపువ్వు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం జగన్మోహన్‌ రెడ్డి అతని తండ్రి చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకొచ్చాడన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు తీసుకురాలేదన్నారు. వ్యవసాయాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రైతులకు వరమైన పోలవరం ప్రాజెక్టును ఈ పూర్తిగా విస్మరించిందన్నారు. నాలుగేళ్లలో సాగునీటి కాలువలకు పూడిక తీసింది లేదన్నారు. పొలాలకు నీరు అందించలేని స్థితిలో వైసిపి పాలన ఉందన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉందన్నారు. ఆక్వా సాగు వెంటిలేషన్‌పై ఉందని తెలిపారు. రంధ్రాలున్న సంచులతో ధాన్యాన్ని ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తుందన్నారు. మూడు రాజధానుల పేర రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారన్నారు. కొబ్బరి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల కల్పనకు ఎలాంటి చర్యలనూ ఈ సర్కారు తీసుకోలేదన్నారు. గంజాయి సాగులో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత వైసిపి సర్కారుదేనన్నారు. యూనిట్‌ రూ.2కే విద్యుత్‌ ఇస్తామని గద్దెనెక్కిన వైసిపి నేడు జోన్‌ పరిధిలో తప్ప మిగిలిన చోట్ల యూనిట్‌కు రూ.3.50 వసూలు చేస్తుందన్నారు. ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతుందని, మరో 6 నెలల్లో ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుందన్నారు.
తాము అధికారంలోకి వస్తే రైతులను రాజును చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. అన్ని మండలాల్లో అన్నా క్యాంటిన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యపాన నిషేదం చేస్తామని చెప్పి మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారన్నారు. దేశంలో ఒక రైతుపై రూ.74 వేల అప్పు ఉంటే రాష్ట్రంలో మాత్రం ప్రతి రైతు నెత్తిమీద రూ.2.40 లక్షల అప్పు ఉందన్నారు. టిడ్కో ఇళ్లకు రంగులు వేయడంలో వున్న శ్రద్ధ వాటిని పేదలకు అందించడంలో లేదన్నారు. జగన్‌ దోచుకున్న డబ్బంతా తాడేపల్లి కొంపకు పోతుందన్నారు.
రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు చేసిన ఘనత టిడిపిదన్నారు. ప్రస్తుతం రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉందని, అనేకమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో ఇసుక మాఫియా కోరలు చాస్తుందన్నారు. ఇసుకను నియోజకవర్గ ఇన్‌ఛార్జి తన అనుచరులతో కలిసి దోచుకుంటున్నారన్నారు. మండలంలోని కేశవరం, ద్వారపూడిలో గ్రావెల్‌ మాఫియా రాజ్యమేలుతుందన్నారు. నిబంధనలు అతిక్రమించి తాతపూడి ర్యాంపులో ఇసుక తవ్వకాలు నిర్వహించినందుకు రూ.10 కోట్లు జరిమానా విధించిందన్నారు. తాను అధికారంలోకొచ్చిన వెంటనే పోలీసుల సమస్యలు పరిష్కారిస్తానన్నారు. కొంతమంది పోలీసులు ముఖ్యమంత్రికి బానిసలుగా మారి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులకు సెలవులు ఇవ్వడంలేదనానరు. అధికారంలోకొస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమన్నారు. వీలునుబట్టి తగ్గిస్తానని తెలిపారు. టిడ్కో ఇళ్లకు రంగులు వేయడంలో వున్న శ్రద్ధ వాటిని పేదలకు అందించడంలో లేదన్నారు. జగన్‌ దోచుకున్న డబ్బంతా తాడేపల్లి కొంపకు పోతుందన్నారు. జిల్లాలో కోడికత్తి కేసు, దళితుడిని చంపిన ఎంఎల్‌సి ఉన్నారని, ఇక్కడి ఇన్‌చార్జ్‌గా వున్న గ్రేట్‌ నాయకుడు కాజులూరు మండలం పల్లిపాలెంలో అక్రమంగా 35 ఎకరాలు కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని తెలిపారు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.