Jul 27,2023 11:08
  • రాజీనామా పత్రాన్ని కమిషనర్ కు సమర్పించిన వెంకటలక్ష్మి

ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం నియోజకవర్గంలోని వైయస్సార్ పార్టీలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు బోస్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే పట్టణానికి చెందిన ఆరో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి మేడిశెట్టి వెంకటలక్ష్మి తన పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి అందజేశారు. శుక్రవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో శ్రీమతి మేడిశెట్టి వెంకటలక్ష్మి ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చ కొనసాగుతుంది. వైసిపి పార్టీకి చెందిన మేడిశెట్టి శేషారావు శ్రీమతి వెంకటలక్ష్మి పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా వైసిపి పార్టీ తరపున గెలిచింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని వారు ఆశించారు. స్థానిక మంత్రి వేణు ప్రస్తుత చైర్మన్ గాధంశెట్టి శ్రీదేవికి, మేడిశెట్టి వెంకటలక్ష్మికి ఉభయ మార్గంగా చేరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్ పదవి ఇస్తానని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. సమయం పూర్తయిన తమకు పదవి దక్కకపోవడంతో జూన్ నెలలో తన రాజీనామాను మేడిశెట్టి వెంకటలక్ష్మి పోస్ట్లో సమర్పించారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆ రాజీనామాను ఆమోదించ లేదు. దీనితో మళ్లీ 28వ తేదీన సమావేశానికి ముందే తన రాజీనామాను మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. దీంతోపాటుగా తాను వైయస్సార్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ విషయాన్ని పట్టణంలో హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒకొక్కరు పార్టీకి దూరమైతే తరువాత పరిస్థితి ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.