ప్రజాశక్తి-అమలాపురం
వరదల సమయం లో ఉప్పలగుప్తం మండలం లో పంట నష్టాన్ని నివారించడానికి అవసరమైన రంగరాజుకోడు మీడియం డ్రైన్ పూడిక తీత పనులు గురువారం ఉదయం ప్రారంభించామని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రైతుల డిమాండును నెరవేరుస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఓ ప్రకటన లో తెలిపారు. రంగరాజుకోడు మీడియం డ్రెయిన్ నంగవరం గ్రామ పరిధిలో ప్రారంభమై 6.20 కి.మీ పొడవునా ప్రవహించి కూనవరం మేజర్ డ్రెయిన్‌లోకి గరిష్టంగా 9.656 క్యూమెక్‌ల వరద నీటిని విడుదల చేస్తుంది వర్షా కాలం లో గోదావరి నది వరదల సమయంలో, రంగరాజుకోడు మీడియం డ్రెయిన్‌కు అమలా పురం మేజర్ డ్రెయిన్ నుంచి రంగరాజుకోడు మైనర్ డ్రెయిన్ ద్వారా వరద నీరు చేరుతుంది అదనంగా రంగరాజుకోడు మీడియం డ్రెయిన్ నుండి విడుదలయ్యే ఈ వరద నీరు కూనవరం మేజర్ డ్రెయిన్ ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. కానీ రంగరాజుకోడు మీడియం డ్రెయిన్ పూడికతీత పనులు చాలా సంవత్సరాలుగా జరగకపోవడం వలన పూడిక ఎక్కువ అయ్యి వర్షాకాలంలో వరద ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లలేక పక్కనే ఉన్న పొలాలు ముంపునకు గురవుతున్నాయని, పొలాల్లో నీరు నిలవడంతో పంటలు దెబ్బతిం టున్నాయని, ఈ పూడిక సమస్య కి పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో మాట్లాడి ఒఎన్‌జిసి సిఎస్‌ఆర్ నిధులు మంజూ రయ్యేలా చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ పూడికతీత ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకుని ఒఎన్‌జిసి సిఎస్ ఆర్ నిధుల ద్వారా గోదావరి మధ్య డెల్టాలో 0 కి.మీ నుంచి 6.20 కి.మీ వరకు రంగరాజుకోడు మీడియం డ్రెయిన్ పూడికతీత పనులు కోసం రూ.94.60 లక్షలు మంజూరు చేశామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ శుక్లా పేర్కొన్నారు. ఈ పూడికతీతపనుల వల్ల ఉప్పలగుప్తం మండలంలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 6000 ఎకరాల్లో వరి పంటను ముంపు బారి నుంచి కాపాడవచ్చు అని పేర్కొన్నారు.










