Jul 17,2023 23:40

ప్రజాశక్తి-మండపేట మండపేట-ఏడిద రోడ్డు మరమ్మతు పనులు బైపాస్‌ రోడ్డు నుంచి కలువపువ్వు సెంటర్‌ వరకు జరగపోవడం, మండపేట- ద్వారపూడి రోడ్డు పనులు సుమారు ఆరు నెలలుగా నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్లు ఎప్పుడు బాగు పడతాయోనని తమ కష్టాలు ఎప్పటికి తొలగిపోతాయని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రోడ్లలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినప్పటికీ పాలకులు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండపేట-ద్వారపూడి రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిసి రోడ్డు పనులు అరకొరగా చేసి మధ్యలో గాలికి వదిలేశారు. దీంతో అటువైపు రాకపోకలు సాగించే వారంతా అష్టకష్టాలు పడుతున్నారు. సెంట్రల్‌ రోడ్డు ఫండ్‌ నిధులు రూ.12.50 కోట్ల పనులు ప్రారంభించగా ఇప్పనపాడు నుంచి జెడ్‌.మేడపాడు వంతెన వరకు బిటి రోడ్డు పూర్తి చేసినప్పటికి అక్కడి నుంచి తాపేశ్వరం వరకు ఒకవైపు సిసి రోడ్డు వేసి మరో వైపు వేయకపోవడంతో స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకు నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టర్‌కు రోడ్డు బిల్లుల చెల్లింపు జాప్యంతో పనులు నిలిచిపోయాయని పలువురు అంటున్నారు.
ఏడిద రోడ్డు
మండపేట నుంచి ఏడిద వెళ్ళే రోడ్డు మరమ్మతు పనులు బైసాస్‌ రోడ్డు నుంచి మండపేట కలువపువ్వు సెంటర్‌ వరకు జరగపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. దీనికి తోడు ఈ రోడ్డు వెంబడి రైసుమిల్లులకు ధాన్యం, తదితరాలు తీసుకువచ్చే భారీ వాహనాలు మిల్లుల ఆవరణలో కాకుండా రోడ్డు చెంతనే నిలిపివేస్తుండంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దుమ్ము, బురదతో ఇబ్బందులు
గోతుల కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎండ కాస్తే దుమ్ము లేచిపడుతుండగా వర్షం వస్తే ఈ రోడ్డు బురద మయంగా మారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.