ప్రజాశక్తి-ఆలమూరు
రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వాలకు స్వస్తి పలికి ప్రజాశాంతి పార్టీకి అధికారంలోకి రాగానే సుస్థిర పాలన అందిస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ అన్నారు. మండలంలోని బడుగువానిలంకలో కోతకు గురవుతున్న భూములను ఆ ప్రాంత రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదల వలన సారవంతమైన లంక భూములు పదుల సంఖ్య ఎకరాలు కోతకు గురై రైతులు ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వాలకు చీమైనా కుట్టడం లేదని దుయ్యబట్టారు. ఈ భూములు చాలా విలువైనవని ఐదు ఎకరాలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో గోదావరి వెంబడి ఉన్న లంక పొలాలు నది కోతకు గురవకుండా పూర్తిస్థాయిలో గ్రోయన్స్ నిర్మించవచ్చని అన్నారు. ఈ చిన్నపాటి సూత్రాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తెలుసుకోలేకపోవడం చాలా ఘోరమని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల గోడు అవసరం లేదని వారి విలాసాలకే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితిలే చూడవలసి వస్తుందని అన్నారు. ఎలాగైనా గెలవాలనే సిద్ధాంతాన్ని నమ్మే ఎన్నికల సమయంలో అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతున్నారని అన్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్, బిజెపి, టిడిపిని విడిచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీతో కలిసి పోటీ చేయాలని అన్నారు.










