ప్రజాశక్తి-అమలాపురం
రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను కాపాడే దిశగా ఖరీఫ్, రబీ పంటలను ఈ-క్రాప్ బుకింగ్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసుబాబు పేర్కొన్నారు. ఆయన 'ప్రజాశక్తి'తో జిల్లావ్యాప్తంగా 1.70 లక్షల ఎకరాల్లో వరినాట్లు లక్ష్యంగా కాగా ఇప్పటివరకు 1.54 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ నెలాఖరుకు మరో రెండు నుంచి మూడు వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తవుతాయని, ఆ తర్వాత నాట్లు పడే అవకాశం లేదన్నారు. ఖరీఫ్ 2023 సీజన్ సంబంధించి ఇ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా రైతులు చేయాలనీ, ఈ- క్రాప్ కార్యక్రమంలో రైతులు వేసిన పంటలను నమోదు పక్కాగా ఖచ్చితత్వంలో నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.నూతన విధానంతో ఈ పంట నమోదును ప్రవేశపెట్టారన్నారు. సంబంధిత సర్వే నెంబరును జియోకార్డినేట్స్ గుర్తిస్తాయి. భూమి గల రైతు తప్పనిసరిగా తను పండించిన పంట వద్ద ఉంటేనే ఈ-పంట నమోదు జరుగుతుందన్నారు. నూతన విధానంలో ఇప్పటివరకు పంట చేనుకు, రైతుకు పది మీటర్ల దూరం వరకు ఉన్న చేలను మాత్రమే జియోకార్డినేట్స్ గుర్తించేవి. క్షేత్రస్థాయిలో ఇబ్బందుల దష్ట్యా ఆ దూరాన్ని 200 మీటర్ల వరకు పెంచారన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 28,350 ఎకరాల్లో ఈ పంట నమోదు జరిగిందన్నారు. సెప్టెంబరు 15 కల్లా ఈ-పంట నమోదు పూర్తిచేసి అనంతరం గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల జాబితా ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు ఉన్న రైతులు సిబ్బంది దష్టికి తీసుకువస్తే పరిశీలన చేస్తారన్నారు. సెప్టెంబరు నెలాఖరుకు ఈ పంట నమోదు తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. వ్యవసాయ ప్రణాళిక ఇన్ పుట్ సబ్సిడీ రుణ ప్రణాళిక వంటి వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పంట నష్టాల తాలూకు ఇన్ పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ పంటలబీమా పథకం తదితర కార్యక్రమాలకు ఈ-క్రాప్ లో నమోదు సమాచారం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తతో తప్పులకు ఆస్కారం లేకుండా నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాగు దారు రైతు యొక్క ఆధార్ నంబర్ నమోదు, సర్వే నంబర్ యొక్క జియో కోఆర్డినేట్ ఉంటాయని కనుక నమోదు ప్రక్రియ తప్పని సరిగా పంట వేసిన క్షేత్రం నుంచి మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.నమోదు ప్రక్రియ లో రైతు సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేయవలసిన ఉంటుందన్నారు. సాగు దారు సాగు చేయు అన్ని పంటల వివరాలు ఈ-క్రాప్ లో నమోదు చేయవలసి ఉంటుందన్నారు. వ్యవసాయ ఉద్యానవన అంతర పంటలు నమోదు చేయునపుడు అంతర పంటలు వేసిన పంటలు నిష్పత్తి క్రమంలోనే పంట పేరు నమోదు చేయాలన్నారు. ఉద్యాన పంటల నందు అంతర పంటలుగా ఉంటే వేసిన రెండు పంటలకు పూర్తి విస్తీర్ణం నమోదు చేయాలన్నారు. ఒక రైతు ఒకే సర్వే నెంబర్లో ఉన్న విస్తీర్ణంలో మొత్తంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు వేసినప్పుడు యాడ్ క్రాప్ ఆప్షన్ నందు వేసిన పంటల విస్తీర్ణం ప్రకారం విడివిడిగా నమోదు చేసి విడివిడిగా ఫోటో అప్లోడ్ చేసే ఆప్షన్ ఉందన్నారు. వెబ్ లాండ్ లోగాని, సిసిఆర్‌సిలో గాని రైతు పేరు లేకుండా ఉండి పంట నమోదు ప్రక్రియలో రైతు వచ్చినప్పుడు పూర్తి ఆధారాలను పరిశీలించి తప్తి చెందిన తర్వాత యాడ్ ఫార్మర్ ఆప్షన్లు నమోదు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ సూచించిన అన్ని అంశాలపై సిబ్బంది ప్రత్యేక దష్టిని సారించి అన్ని విధాలుగా రైతులకు మేలు చేకూర్చే దిశగా అడుగులు వేయా లని ఆయన సూచించారు. ఈ క్రాప్ బుకింగ్ అనేది సున్నితమైన అంశమని సూపర్‌వైజర్ ఈ చెక్కు అనేది తప్పని సరిగా ఉండాలని సామాజిక తనిఖీ పారదర్శకంగా ఉండేందుకు వీలుగా నివేదిక రూపకల్పన జరగాలన్నారు. ప్రతి దశలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.










