Jul 08,2023 15:33

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : మండల కేంద్రం మైన కపిలేశ్వరపురంలో అధిక స్పీడ్ తో వెళుతున్న ఇసుక లారీలను శుక్రవారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఇసుక లారీలు మితిమీరిన వేగంతో రాత్రి పగలు తేడా లేకుండా,ఇసుక స్టాకీయార్డు పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకొని నిరసన చేశారు . ఏటిగట్టు రహదారి ఇరుకైన రోడ్డు కావడం అధిక లోడుతో ఇసుక లారీలు ఏటుకట్టుపై స్పీడుగా వెళ్లడంతో, ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి మీదుగా వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని, దుమ్ము లేకుండా నీళ్లు చల్లాలని గ్రామస్తులు పలుమార్లు నిర్వాహకులకు చెప్పినా ప్రయో జనం లేకపోయిందన్నారు. దీంతో ఓపిక నశించి గ్రామానికి చెందిన పలువరు శుక్ర వారం రాత్రి రోడ్డు పైకి వచ్చి సుమారుగా గంట సేపు ఇసుకతో వెళ్తున్న టిప్పర్లు, లారీలను, నిలుపుదల చేశారు. టిప్పరు సామర్థ్యం 18 టన్నులు ఉండగా 34టన్నులతో అతివేగంతో వెళ్తున్నా అడిగే వారే లేరనా మీ ఇష్టాంసారంగా వాహనాలు నడిపితే ఎప్పుడు ఏ ప్రమాదాలు  జరుగుతాయోనని భయపడి ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తెలియడంతో అంగర ఎస్సై జి చంటి  గ్రామస్తులకు సర్ది చెప్పి ఇసుక రిచ్ నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిలుపుదల చేసిన లారీలను గ్రామస్తులు వదిలిపెట్టారు.