ప్రజాశక్తి-ఆత్రేయపురం
ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది శుక్రవారం విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టి రైట్స్ మరియు టెక్నాలజీ, 'నేషనల్ వర్కషాప్ ఆన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ నిర్వహించి జిఐ సర్టిఫికెట్ అందజేశారు. పూతరేకులు పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది ఆత్రేయపురం. ఈ ప్రాంత మహిళలు తయారు చేస్తున్న పూతరేకులను విదేశాలకు సైతం తీసుకువెళ్తున్నారు. వీటికి భౌగోళిక గుర్తింపు తీసుకురావాలని ఆత్రేయపురం వాసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారసత్వ సంపద గుర్తింపు లభించడానికి డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సంక్షేమ సంఘం విశేష కషి చేసింది. విశాఖపట్నం దామోదర సంజీవయ్య న్యాయ విశ్వ విద్యా లయంలోని లా విద్యార్థులు ఆత్రేయపురం గ్రామాన్ని సందర్శించి పూతరేకుల తయారీ, అమ్మకాలపై డాక్యుమెంటరీ రూపొంది ంచారు. 2021 డిసెంబరు 13న చెన్నైలోని జీయో ఐడెంటీ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీని సమర్పించారు. అనంతరం ఏడుగురు సభ్యుల బందం, వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది నిపుణులు పూతరేకుల తయారీ విధానాలపై సమాచారం తెలుసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి జి.రాజేంద్రప్రసాద్ జిఐ అధికారులకు పూతరేకులకు సంబంధించిన సమాచారం అంది ంచారు. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో పూతరేకుకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ అరుదైన గౌరవం లభించడంపై ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










