మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో
హోం మంత్రి వనిత
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చూట్టారని హోం శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం విజయనగరంలో నూతనంగా వైద్య కళాశాలను సిఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రారంభించారు. శుక్రవారం స్థానిక నూతన ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్ ఆకులు వీర్రాజు, ఎపి గ్రినరీ బ్యూటిఫి కేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులను జగనన్న ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 2023-24లో ఐదు మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతులను ప్రారంభించారన్నారు. ప్రతి మెడికల్ కళాశాలను రూ.500 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్, 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, అత్యాధునిక సాంకేతికతతో లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీ టీవీల ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో కొచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. మల్టీ/సూపర్ స్పెషాలిటీ అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆదిశలో 500 బెడ్స్ ఆసుపత్రిగా అభివద్ధి చేస్తామన్నారు. చుట్టుపక్కల జిల్లాల వారికీ దీని ద్వారా వైద్య సేవలు అందుతాయన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దే విధానంలో ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేశారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా అడుగులు ముందుకు వేయడం పట్ట ఎంపీ భరత్ రామ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ ఆసుపత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, మెడపాటి షర్మిలా రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, బోధనా సుపత్రి వైద్యులు, మెడికో విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.










