ప్రజాశక్తి-అమలాపురం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కచ్చితత్వంతో కూడిన ఓటరు జాబితా రూపకల్పనకై ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణను నాణ్యతతో పారదర్శకంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే నూటికి నూరు శాతం పూర్తయిందని, ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియ 98 శాతం పూర్తయ్యిందని తెలిపారు. ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి దశలో ఓటర్లకు సమాన అవకాశాలు కల్పిస్తూ అత్యంత జవాబుదారీతనంతో జాబితా రూపకల్పనకు పటిష్టమైన చర్యలు కొనసాగుతు న్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,300 ఓటర్ల చిరునామాలు మారాయని, వీరు ఏ అడ్రస్‌లో నివాసం ఉంటున్నారో తెలిపితే అక్కడ మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తామన్నారు. వేరే చిరునామాలను తొలగించేందుకు పోస్టు ద్వారా నోటీసులు అందిస్తామన్నారు. 26,209 ఓటర్లు మరణించినట్లు ఇప్పటి రకూ గుర్తించినట్టు వీరిని ఫారం -7 ద్వారా తొలగించడానికి నోటీసులు అందించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. 1,728 మంది, ఓటర్ల పేర్లు రిపీట్ అయ్యాయని వీరు ఓట్లు ఎక్కడ ఉంచాలో నోటీస్ ద్వారా తెలుసుకొని మిగిలిన చోట్ల వీరిని ఫామ్ -7 ద్వారా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 5,263 మంది ఓటర్లను ఆబ్సెంట్లుగా గుర్తించామని తెలిపారు. ఈ ప్రక్రియలో అన్ని ఎక్సర్‌సైజులు ముగిసిన పిమ్మట ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 1500 మించి ఓటర్లు ఉన్నట్లయితే వీరికోసం మరొక పోలింగ్ స్టేషను ప్రతిపాదిస్తామన్నారు. గతంలో తొలగించిన ఓటరు జాబితాపై రీ వెరిఫికేషన్ చేసి అర్హులు ఎవరైనా ఉంటే వారికి ఫామ్ 6 ద్వారా ఓటర్‌గా అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ఓటరుగా నమోదుకు 12000 దరఖాస్తులు అందాఅన్నారు. సెప్టెంబర్ 20 నాటికి పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రక్రియపై కార్యాచరణ ముగించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, నాయకులు పి.ఉదయ భాస్కర్, కె.శ్రీనివాసరావు, ఆర్‌డి.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.










