Sep 16,2023 23:26

ప్రజాశక్తి-యంత్రాంగం
అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లాలో పలుచోట్ల అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు.
అమలాపురం ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక వారోత్సవాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా అమలాపురంలో శనివారం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమలాపురం డిగ్రీ కళాశాల్లో ప్రిన్సిపల్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ అధ్యక్షతన ఓజోన్‌ పొర పరిరక్షణ అవగాహనా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.వి.రామ్‌ ప్రసాద్‌ 1987 సెప్టెంబర్‌ 16 న కెనడా లో మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం జరిగిందని దానికి గుర్తుగా ప్రతి ఏటా ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం సెప్టెంబర్‌ 16 న జరుపుకుంటున్నామన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవివి సత్యనారాయణ మాట్లాడుతూ మే 1985 లో బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే కథనం యొక్క ఫలితాలను ప్రచురించిన తరువాత అంటార్కిటికా పై ఓజోన్‌ పొర క్షీణత దగ్విషయం 'ఓజోన్‌ పొర'గా పేర్కొనబడిందన్నారు. ఓజోన్‌ పొర పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. అనంతరం కొంకాపల్లి జవహర్‌ లాల్‌ నెహ్రూ పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయులు కె.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఓజోన్‌ పొర పరిరక్షణ అవగాహనా కార్యక్రమం జరిగింది. పోస్టర్‌లను ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి డా.రాంప్రసాద్‌, కెవివి.సత్య నారాయణ మాట్లాడారు. కార్యక్రమాల్లో కళాశాల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రామచంద్రపురం ఎపి రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఓజోన్‌ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కె.గంగవరం మండలం జెడ్‌పిఉన్నత పాఠశాల నందు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు జిల్లా విద్యాశాఖ సిబ్బంది మరియు సామాజికవేత్తలు గ్రామస్తుల సహాయంతో ఓజోన్‌ పరిరక్షణ మన అందరి బాధ్యత నే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. తదుపరి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ ,డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించారు. జిల్లా ఉప విద్యశాఖ అధికారి ఎస్‌ఎల్‌.నరసింహ (ఫణి)అధ్యక్షతన బహుమతి ప్రధానోత్సవం జరిగింది. జిల్లా సైన్స్‌ అధికారి జివిఎస్‌.సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ బ్రహ్మానందం, సత్యవాడ గ్రామ సర్పంచ్‌ సలాది శ్రీనివాసు, పాఠశాల విద్యా కమిటీ ఛైర్‌పర్సన్‌ సలాది దుర్గాదేవి, వివిధ పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మండపేట పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఎంఇఒ నాయుడు రామచంద్రరావు అన్నారు. శనివారం ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం, వినాయక చవితిని పురస్కరించుకొని స్థానిక శ్రీ గౌతమి మున్సిపల్‌ హైస్కూల్‌ నందు నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌, జిల్లా విద్యా శాఖ వారి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డ్రాయింగ్‌ పోటీలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని చల్లా శోభావళి, నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌ క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ మేకా రామలక్ష్మి, సిఆర్‌పి శేషారావు, ఉపాధ్యాయులు నాగుమల్లి ప్రసాద్‌, రోజా కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక సంగమేశ్వర కాలనీలో ఎంపిపి పాఠశాల్లో అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. మామిడికుదురు నగరం దీప్తి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు ఓజోన్‌ పొర యొక్క ఆవశ్యకత ను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. కరస్పాండెంట్‌ డివివి.సత్యనారాయణ ఓజోన్‌ పొర ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ జక్కంపూడి శివప్రసాద్‌, హెచ్‌ఎం గుబ్బల మౌనికాదేవి, మరియు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.