Sep 11,2023 23:55

అంబాజీపేటలో వర్షంలోనే నిరసన తెలుపుతున్న టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి - యంత్రాంగం
మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఇచ్చిన రాష్ట్ర బంద్‌ టిడిపి, జనసేన నేతల పోలీసు నిర్బంధాల మధ్య సోమవారం ప్రశాంతంగా జరిగింది. నగర, మున్సిపల్‌ కేంద్రాల్లో బంద్‌ పాక్షికంగా జరగగా, మండల కేంద్రాల్లో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలను ముందస్తుగానే హౌస్‌ అరెస్టులతోనూ, పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలను ఆందోళనకారులు బంద్‌ చేయించగా, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ముందస్తుగానే ఆయా సంస్థలకు శెలవును ప్రకటించాయి. వివిధ వ్యాపార సంస్థల యాజమాన్యాలు స్వచ్చంధంగానే దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించాయి. అయితే ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు సర్వీసులు పాక్షికంగా తిరిగాయి అమలాపురంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి, జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబెడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. అమలాపురం బులియన్‌ మార్కెట్‌ స్వచ్చంద బందుకు పిలుపునిచ్చి షాపులు మూసివేశారు. పోలీసు భద్రత నడుమ ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. జనసేన నేతలు విఎంఆర్‌ శేఖర్‌, శెట్టిబత్తుల రాజబాబులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు..అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు అమలాపురం పార్లమెంటు ఇంచార్జ్‌ డిఎంఆర్‌.శేఖర్‌ని సోమవారం తెల్లవారుజామునే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రోడ్లు పైకి వచ్చిన పట్టణ టిడిపి కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణతో పాటు పది మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అమలాపురం రూరల్‌ స్టేషన్‌కు తరలించారు. బస్టాండ్‌ వద్ద బస్సులను అపి ధర్నా నిర్వహిస్తున్న టిడిపి పట్టణ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీసుభాష్‌చంద్రబోస్‌ను నాయకులను అరెస్టు చేసి ఉప్పలగుప్తం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎంఎల్‌ఎ అయితాబత్తుల అనందరావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో షాపులను మూయించారు. కొత్తపేట మండలంలో బంద్‌ విజయవంతమైంది. వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ కార్యాలయాలు, బ్యాంకులను స్వచ్ఛందంగా మూసివేశారు టిడిపి మండల అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు బండారు సంజీవ్‌, ముత్యాల బాబ్జి, అన్యం మునీశ్వరరావు, ముద్రగడ సుబ్బారావు, బాబు, బూసి విష్ణుమూర్తి, ముత్యాల రాజు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రీనివాస్‌ బంద్‌లో పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో టిడిపి, జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలను మూయించేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆలమూరులో 18 గ్రామాల్లో బంద్‌ స్వచ్ఛందంగా నిర్వహించారు. పలుచోట్ల టిడిపి శ్రేణులు వాణిజ్య సంస్థలను మూయించేశారు. పలుచోట్ల టిడిపి నాయకులు నిరసనలు తెలిపారు. మామిడికుదురులో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పాశర్లపూడి, మామిడికుదురు సెంటర్లలో వ్యాపార సముదాయాలు మూయించి వేశారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ మూసివేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్‌, చుట్టుగుళ్ళ కిషోర్‌, జనసేన నాయకులు, పాల్గొన్నారు. అమలపురం రూరల్‌లో టిడిపి సీనియర్‌ నాయకులు పరమట శ్యామ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం అన్ని విద్యాసంస్థలు,వాణిజ్య వ్యాపార సంస్థలను మూయించారు.అ ధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీశైలం మాజీ ట్రస్టీ చింతా శంకరమూర్తి తన ఇంటి వద్ద నల్ల జండా కట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టును జనసేన అమలాపురం నియోజకవర్గ నాయకులు లింగోలు పండు ఖండించారు. టిడిపి శ్రేణులు ప్రకటించిన బందుకు మద్దతు తెలిపారు. మండపేటలో బంద్‌ కారణంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బంద్‌ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలవపువ్వు సెంటర్‌, బస్టాండ్‌, రాజారత్న సెంటర్‌ తదితర చోట్ల పోలీసులు భారీగా మోహరించారు. రామచంద్రపురం బంద్‌ ప్రభావం ద్రాక్షారామలో కనిపించలేదు. షాపులు యథావిధిగా పనిచేశాయి. మండలంలో బంద్‌ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. పట్టణంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. సెక్షన్‌ 30 అమల్లో ఉండటంతో ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంబాజీపేటలో వర్షంలోనే టిడిపి, జనసేన శ్రేణులు బంద్‌ నిర్వహించాయి. టిడిపి మండల అధ్యక్షులు గూడాల ఫణిని పోలీసులు గృహనిర్భందం చేశారు. అంబాజీపేట, పుల్లేటికుర్రు సెంటర్లలో టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. మాజీ ఎంపిపి డివివి.సత్యనారాయణ, శిరిగినీడి వెంకటేశ్వరరావు, చిన్నం విజయరావు, అరిగెల సూరిబాబు, ఎన్‌.వి. సుబ్బారావు, మైపాల తాతాజీ, ఢిల్లీ,టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో టిడిపి మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, ఆపార్టీ నాయకులు నిరసన తెలిపారు. మండలంలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉప్పలగుప్తం, గొల్లవిల్లి, భీమనపల్లి, చల్లపల్లి, ఎస్‌.యానాం, ఎన్‌.కొత్తపల్లి ప్రధాన గ్రామాల్లోని వ్యాపార కూడళ్ళలో దుకాణాలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.