Aug 24,2023 00:07

ప్రజాశక్తి-ఆత్రేయపురం పచ్చటి తివాచీ పరిచినట్టుగా కనపడే సారవంతమైన లంక భూములు ఏట నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఉన్న కొద్దిపాటి భూములు కూడా నదీ ప్రవాహానికి అండలుగా విరిగిపోయి నదిలో కలిసిపోతుంటే ఏమీ చేయని పరిస్థితుల్లో నిస్సహాయంగా చూస్తున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాలలో గౌతమీ నది కుడి ఎడమ వశిష్ట నది ఎడమ పక్క ఉన్న వందలాది ఎకరాల లంక భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
గోదావరి ఉధృతికి 1000 ఎకరాలపై లంక భూములు కోతకు గురై వరదలు వచ్చినప్పుడు లంక భూములతో పంపుషెడ్లు, చెట్లు, పశువుల మకాములు, మోటారు షెడ్లు నదిలో కలిసిపోవడం పరిపాటి అయిపోయింది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, పులిదిండి, వెలిచేరు, రాజవరం, వసంతవాడ, తాడిపూడి, నార్కెడిమిల్లి, అంకంపాలెం, వాడపల్లి, పులిదిండి, మర్లపాలెం, ర్యాలి, పోలవరం, పొడగట్లపల్లి, వాడపల్లి, బడుగు వాని లంకలు తదితర చోట్ల లంక భూములు కోతకు గురై ఎక్కువగా నదీ గర్భం కలిసిపోతున్నాయి
కోనసీమ ముఖద్వారం వశిష్ట నది బ్యారేజీ చెంత వరదల సమయంలో లంక కోత అధికంగా ఉంటోంది. అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించి చర్యలు తీసుకోవాలని లంక రైతులు కోరుకుంటున్నారు. వద్దిపర్రు, ఆత్రేయపురం, పేరవరం, వాడపల్లి, మెర్లపాలెం, వెల్చేరు, పేరవరం తదితర చోట్ల ఏటిగట్లను అభివృద్ధి పరచకుండా అలాగే వదిలేయడంతో వరదల సమయంలో ఆ గ్రామాల వాసులు ఎప్పుడు ఏం ప్రమాదం వస్తుందని భయాందోళన చెందుతున్నారు. లంక పొలాలు నదీగర్భంలో కలిసిపోకుండా ఉండాలంటే రాతి కట్టుబడే శరణ్యం అంటున్నారు. పంట పొలాలు నదీగర్భంలో కలిసిపోకుండా గతంలో పేరవరం, బొబ్బర్లంక వంటి పలుచోట్ల గ్రోయిన్స్‌ నిర్మించడంతో కొంతవరకు లంక భూములు కోతకు ఇది కాకుండా నివారించగలిగారు. సంబంధిత అధికారులు ప్రణాళికను రూపొందించి రక్షణ చర్యలు చేపడితే లంక భూములు నదీ గర్భంలో కలిసిపోకుండా ఉంటాయని లంక పొలాలకు రైతులు కోరుకుంటున్నారు