Aug 17,2023 21:50

ప్రజాశక్తి-అమలాపురం
సిఐటియు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అమలాపురం మున్సిపల్‌ ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా, మానవహారం నిర్వహించారు. కార్యక్ర మానికి సిఐ టియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్‌ ప్రతిని ధిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికు లను వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పర్మినెంట్‌ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చారన్నారు. కానీ ఈరోజుకీ ఆ హామీలు అమలు చేయకపోవడం దురదృష్టకరమ న్నారు. పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పారిశుధ్యం పనులు చేస్తుంటే కనీసం వీరికి సబ్బులు, కొబ్బరినూనె, చెప్పులు, యూనిఫామ్‌ కూడా ఇవ్వడం లేదని అన్నారు. మున్సిపల్‌ ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చడం వల్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే కార్మికులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టి.గోపి, నిమ్మకాయల దుర్గ, కుమారి, లీలావతి, తలుపులమ్మ, సత్యవతి, వరలక్ష్మి, సాయిబాబు, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.