ప్రజాశక్తి-అమలాపురం
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీని గద్దెదింపుదాం, దేశాన్ని రక్షించుకుందాం నినాదంతో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని జిల్లా రెవెన్యూ ఆఫీసర్ సత్తిబాబుకి సమర్పించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కనీసవేతనం రూ.26వేలు చేసి అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేయాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, మణిపూర్, హర్యానా రాష్ట్రాల్లో హింసను అరికట్టి, బాధితులను ఆదుకోవాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, స్కీం వర్కర్ల అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉపాధి హామీపథకాన్ని 200 రోజులకు పెంచి కనీస వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు సమానపనికి, సమానవేతనం చెల్లించాలని, మహిళలపై హింసను అరికట్టి, అన్ని ప్రభుత్వ, ప్రేవేటు సంస్థలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటుచేయాలని, ఇపిఎఫ్ కనీస పెన్షన్ రూ.9వేలు చెల్లించాలని, ట్రాన్స్‌పోర్ట్, హమాలి, భవన నిర్మాణం, ఆటో కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రకార్మిక సంఘాలు తలపెట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగింది. అన్నారు. మోడీ ప్రభుత్వానికి 2016లో 13 కేంద్ర కార్మికసంఘాలు పైన పేర్కొన్న డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు.
వీటిలో ఒక్క డిమాండ్‌నీ కూడా 7ఏళ్లలో మోడీ ప్రభుత్వం పరిష్కరించలేని కారణంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్ట్ 9 జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తూ విభజన చట్టాన్ని అమలు చేయకపోయినా, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మాట మార్చి పరిశ్రమలు ఆంధ్రాకు రాకుండా చేసినా, పోలవరం నిధులు ఇవ్వకుండా, నిర్వాసితుల సమస్య మాకు సంబంధం లేదని కుండబద్ధలు కొట్టినా, జిఎస్‌టి నిధులు విడుదల సందర్భంగా స్థానిక సంస్థల్లో పన్నులు పెంచాలని కండిషన్ లు పెడుతున్నా, ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నా, అదానికి అనుకూలంగా రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే 2020 విద్యుత్ చట్టం తెచ్చి రైతులకు ఉచిత కరెంటుకు మంగళం పాడుతున్నా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కుదరదని చెప్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడంలేదన్నారు.
దేశవ్యాప్తంగా ప్రజల, కార్మికుల, రైతుల సమస్యలకు కారణమవుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే వైసిపి ప్రభుత్వం భుజాలు తడుముకుంటూ నిరసనలు తెలుపకుండా జిఒ నెంబర్ ఒకటి లాంటి తెస్తున్నారని అన్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని, మోడీ విధానాలనే వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తూ షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికుల వేతనాలు 15 ఏళ్లనుండి సవరించకుండా అన్యాయం చేస్తున్నారని, భవన నిర్మాణ కార్మికుల కష్టంతో పోగేసుకున్న రూ.2వేల కోట్లు వాడేసుకుని, కార్మికులకు ఇచ్చే సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారన్నారు. ఇందుకు ఫలితం 2024 ఎన్నికల్లో కేంద్రంలో మోడీ, వైసిపి జోడి ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్మికులు,, కర్షకులు, ప్రజలు ఆయా సమస్యలపై పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ, జనపల్లి మంగాదేవి, తాడి శ్రీరామ్ మూర్తి, కెవిపిఎస్ నాయకులు తులసి రావు, విజరు, సిఐటియూ నాయకులు నిమ్మకాయల వెంకటేష్, వీరబాబు, విప్పర్తి మోహన్ రావు , టి.గోపి, జగడం నాగేశ్వరరావు, సాక్షి, భూషణం, రామకృష్ణ, ఆదికృష్ణ, ప్రకాష్, ప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










