Jul 23,2023 00:33

ప్రజాశక్తి-రాజోలు
గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో కోనసీమ పరిధిలోని గోదావరి తీర లంక గ్రామాలు ముంపుతో అల్లాడుతున్నాయి. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు నాటు పడవల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో లంక గ్రామాలకు వెళ్లేవారికి, లంక గ్రామాల నుంచి ఇవతలి తీరానికి వచ్చే వారికి ఇబ్బందులు పెరిగాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో గోదావరి తీరంలోని లంక గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారింది.
లంకల్లో పంట పొలాలున్న వారు, పాడిపశువులున్నవారు వెళ్లటానికి మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. సఖినేటిపల్లి మండలం అప్పనిరాములంక వద్ద కాజ్‌ వే పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో పెదలంక, అప్పనిరాములంక గ్రామాలకు నిరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాజ్‌ వే వద్ద అధికారులు పడవలు ఏర్పాటు చేయకపోవడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇక రాజోలు మండలం లో వశిష్ఠ గోదావరి పరవళ్లు తొక్కుతుంది. రాజోలు కాటన్‌ పార్క్‌, రాజోలు నూతన పార్క్‌, కైలాస భూమి, నున్న వారి బాడడ, సోంపల్లి పుష్కర రేవు, ఇసుక రిచ్‌ నీట మునిగాయి. సోంపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల రేవుకు వెళ్లే పడవలను, పంటు ను తాక్కలికంగా నిలిపివేశారు. గోదావరి వెంబడి ఉన్న లంక గ్రామాలు నీట మునగడంతో ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. వరద ఉదతి పెరుగుతుండటంతో రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను ఇసుక బస్తాలతో బలపరిచారు.రాజోలు మద్యలంక లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.