Jul 15,2023 23:31

ప్రజాశక్తి-మండపేట
పట్టణ ప్రజలకు సూపర్‌ ఫైన్‌ రకం బియ్యం కిలో రూ.46 కే అందివ్వాలనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో అందుబాటులోకి తెచ్చామని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభి రామయ్యచౌదరి అన్నారు. స్థానిక రైతు బజార్లో శనివారం ఏర్పాటు చేసిన సూపర్‌ ఫైన్‌ బియ్యం స్టాల్‌ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయట మార్కెట్లో ఈ రకం బియ్యం రూ.65 నుంచి రూ.70 వరకూ ఉందన్నారు. అదే బియ్యాన్ని సామాన్యులకు సైతం అందివ్వాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఆదేశాల మేరకు ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు రైతుబజార్లో స్టాల్‌ ను ప్రారంభించామని, త్వరలో పట్టణంలో మరో స్టాల్‌ ను ఏర్పాటు చేయనున్నట్టు పట్టాభిరామయ్య చౌదరి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్‌ఎస్‌ఒ సుబ్బరాజు, రైతు బజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ బోళ్ల సతీష్‌, కోళ్ళ శ్రీనివాస్‌, బత్తిన దొరబాబు తదితరులు పాల్గొన్నారు.