Jul 29,2023 23:15

ప్రజాశక్తి - యంత్రాంగం
గోదావరికి వదర ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద కొనసాగుతున్న నేపథ్యంలో 'కోనసీమ'లో లంక గ్రామాలు వరదనీటిలో విలవిలలాడుతున్నాయి. పలుచోట్ల కాజేవేలపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంకల గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాజోలు :
గోదావరికి వరద ఉధృతి కొనసాగు తోంది. వరద ముంచెత్తడంతో లంక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన నదులైన వద్ధ గౌతమి, వశిష్ట వైనతేయ గోదావరి పాయలకు వరద పోటెత్తింది. ఇప్పటికే కోనసీమలో దాదాపు 60 లంక గ్రామాల ప్రజలకు పునరావాసాన్ని జిల్లా అధికార యంత్రాంగం సిద్ధచేసింది. జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, అమలాపురం ఆర్‌డిఒ వసంతరాయుడు జిల్లా లో అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలకు హై అలెర్ట్‌ ప్రకటించారు.
ఏటిగట్లను తాకిన ప్రవాహం
ధవళేశ్వరం వద్ద ముడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా గోదావరి వరద కోనసీమలో అన్ని ఏటిగట్లను తాకింది. పల్లప్రాంతాలు జలమయ మయ్యాయి. రాజోలు నియోజకవర్గంలోని అప్పనారామునిలంక, టెకిశెట్టిపాలెం ఉన్న నదీపాయపై ఉన్న వంతెన చుట్టూ.. కొత్తలంక కాజ్‌వే పైకి వరదనీరు చేరి.. రాకపోకలు నిలిచిపోయాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే పైకి వరద నీరు చేరింది. రాజోలు పరిధిలో ఏటి గట్లు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. పలు లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరద తగ్గేందుకు మరో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.
లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద
మామిడికుదురు: వరద భయంతో వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ద గౌతమి, నదీ పరివాహక గ్రామాల ప్రజలు భయంతో వణుకుతున్నారు.
వరద ప్రాంతాల సందర్శించిన కలెక్టర్‌
పి.గన్నవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సుమారు 30 లంక గ్రామాలు వరద నీటిలో చిక్కు కున్నాయి. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు , అవసరమైనచోట్ల ఆహార సదుపాయాలు, పడవలు ఏర్పాటు చేశామన్నారు.
మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జల దిగ్బంధంలో వరద బాధితులు అవస్థలు పడుతున్నా ప్రజాప్రతినిధులు ఏటిగట్లకే పరిమితమై ఏటిగట్టు ఎగువ నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు జి.పెదపూడి వద్ద ప్రధాన పంటకాలపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. మాజీ ఎంఎల్‌ఎ పాముల రాజేశ్వరి దేవి అప్పనపల్లి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
వరద పరిస్థితిపై మంత్రి సమీక్ష
రామచంద్రపురం: కె.గంగవరం మండలంలోని కోటిపల్లి గోదావరి వద్ద మత్స్యకార కాలనీలోనికి వరద నీరు ప్రవేశించింది. వరద నీటి పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం కోటిపల్లి లో పర్యటించారు. గోదావరి లో వరద నీరు పెరుగు తున్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాల న్నారు.
వరద ప్రాంతాలకు రూ .10 కోట్లు మంజూరు
కోటిపల్లి-సుందరపల్లి మధ్య గల కుమ్మరి సవరం వద్ద బలహీన ఏటి గట్టును మంత్రి వేణు పరిశీలించి అక్కడ జరుగుతున్న రక్షణ పనుల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వరద పరిస్థితి పై సిఎం సహాయ చర్యల కోసం రూ.10 కోట్లు మంజూరు చేశారన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితిలేనందున వారికి ఉచిత బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసేందుకు సిఎంతో మాట్లాడానని అన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం:అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయతీ పరిధిలో పల్లిపాలెం రేవు వద్ద గోదావరి వరదను పరిశీలించి ప్రజల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పినిపే విశ్వరూప్‌ సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు
అయినవిల్లి: వీరవల్లిపాలెం పిహెచ్‌సిపరిధిలో ఉన్న వరద ముంపు ప్రాంతాలను మరియు మెడికల్‌ క్యాంపు లను మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌ పర్యవేక్షించారు.
వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు
అమలాపురంరూరల్‌ : బండారులంక వల్లూరు వారి కాలనీ సమీపంలో అప్పర్‌ కౌశిక ఏటి గట్టు గోదావరి నీటి ప్రవాహం వల్ల గండి పడే ప్రదేశంలో శనివారం సర్పంచ్‌ పెనుమాల సునీత ఆధ్వర్యంలో ఇసుక బస్తాలు వేయించారు.
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఆర్‌డిఒ
ఐ.పోలవరం: కేశనకుర్రు గ్రామపంచాయతీ పరిధిలో వరద ముంపునకు గురైన చిన కేశనకుర్రు -ఫిషర్‌ మెన్‌ ఏరియాలో నివాసం ఉంటున్న కుటుంబాలవారికి భోజన ఏర్పాట్లు శనివారం ప్రారంభించారు. అమలాపురం ఆర్‌ డిఒ వసంతరాయుడు భోజనం ప్యాకెట్లను అందజేశారు.
ఆత్రేయపురం: గోదావరి నది ప్రమాద స్థాయిలో వరదనీరు ఏటిగట్లకు తాగడంతో లంక పొలాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఉద్యానవన పంటలువరద నీటిలో నానుతున్నాయి.
కాట్రేనికోన: గోదావరి వరద నేపథ్యంలో ముంపుకు గురైన ప్రాంతాలను తహశీల్దార్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ ఎస్‌.వెంకట చలం శనివారం పరిశీలించారు, బూలావారిగట్టు దగ్గర ఇరిగేషన్‌ ఎఇ శివరామ కృష్ణ పర్యవేక్షణలో ఇసుక బస్తాలను సిద్ధం చేశారు.
కపిలేశ్వరపురం: వరద నేపథ్యంలో ఆయాప్రాం తాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.