Sep 08,2023 23:14

ప్రజాశక్తి-రాజోలు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం దిండి వద్ద లోకేష్‌కు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కొబ్బరి కాయల దండతో ఘన స్వాగతం పలికారు. దిండి నుంచి శివకోటి, రాజోలు, సోంపల్లి మీదుగా పొదలాడకు పాదయాత్ర చేరుకుంది. యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగింది.. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్‌ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్‌.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసు కుంటున్నారు. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు.ఈ పాదయాత్రకు పలువురు టిడిపి నాయకులు, ఉమ్మడి తూర్పు జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు దిండి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా టిడిపి జెండాలు, బెలూన్లు, బ్యానర్లు కనిపించడంతో మొత్తం పసుపుమయంగా మారింది. ఇక పాదయాత్ర ప్రారంభమయ్యాక రాజోలులో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి నారా లోకేష్‌ నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో పాదయాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిన్నంటినీ అధి గమిస్తూ లోకేష్‌ ముందుకు సాగారు. పలు సామాజిక వర్గీయులు, గ్రామాల ప్రజలు, రైతులు, యువతతో ఇలా అనేకమందితో లోకేష్‌ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతామంటూ హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఆయన వెంట మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం ఇన్‌ఛార్జ్జి గంటి హరీష్‌మాథూర్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్‌, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ, మోకా పార్వతీ, నల్లిమోహన్‌ జిల్లా నాయకులు కార్యకర్తలు ఉన్నారు.