Sep 06,2023 22:34

బైపాస్‌ రోడ్డు పక్కనే పడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

ప్రజాశక్తి - మండపేట
మండపేట పట్టణ పరిధిలోని సుమారు రెండు కిలోమీటర్ల పరిధి ఉన్న బైపాస్‌ రోడ్డుకిరువైపులా గుట్టలుగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు పేరుకు పోతున్నాయి. ప్లాస్టిక్‌ నిషేదం ఎక్కడా అమలు కావట్లేదు. ఈ రోడ్డులో ఉన్న వైన్‌ షాపుల వద్ద మందుబాబులు మద్యం కొనుగోలు చేసి వీటికి సమీపంలో వేసిన చిన్న చిన్న పాకల వద్ద ప్లాస్టిక్‌ గ్లాసులు, తదితర వస్తువులు కొనుగోలు చేసి మద్యం సేవిస్తుంటారు. అనంతరం ప్లాస్టిక్‌ వ్యర్థాలను రోడ్డుపక్కనే పడేస్తున్నారు.
ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్లాస్టిక్‌ విక్రయాలు అధికమవుతున్నా అధికారుల్లో ఉలుకూ పలుకూ లేకపోవడంతో మరింత విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వం చేసే ప్రకటనలు వాస్తవ రూపం దాల్చడం లేదు. పట్టణ, గ్రామాల్లో ప్లాస్టిక్‌ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. కూరగాయల దుకాణాలు, వైన్‌ షాపులు, మాంసం విక్రయించే దుకాణాలు, కిరాణా షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు, సంచులను ఉపయోగిస్తున్నారు. ఇదంతా అధికారులు కళ్లెదుటే సాగుతున్నా.. అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ కారణంగా పచ్చగా కళకళలాడే పల్లెలు ప్లాస్టిక్‌ వాడకంతో కళావిహీనంగా తయారయ్యాయి. పూర్వం శుభకార్యాలప్పుడు భోజనం చేయడానికి అరటి ఆకులు వినియోగించేవారు. కాని నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాలప్యాకెట్ల నుంచి మొదలుకుని భోజన సమయంలో ఉపయోగించే ప్లేట్లు, గ్లాసుల వరకు ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడి పడేసిన తర్వాత వీటి వ్యర్థాలు భూమిలో కలిసిపోయేందుకు కొన్నేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
జీవులకు ప్రాణసంకటంగా ప్లాస్టిక్‌
ప్లాస్టిక్‌ వస్తువులు జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. అన్ని కార్యక్రమాలకు ప్లాస్టిక్‌ వస్తువులను వాడడం పరిపాటిగా మారింది. వినియోగించిన ప్లాస్టిక్‌ గ్లాసులు, విస్తర్లు వారి ఇళ్ల సమీపంలో పడేస్తున్నారు. వాటిని పారిశుధ్య సిబ్బంది సకాలంలో తొలగించకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. సమీపంలో సంచరించే పశువులు, పందులు తదితర జీవాలు ప్లాస్టిక్‌ వస్తువులను తినడంతో పలు రుగ్మతలకు గురౌతున్నాయి.
నిబంధనలు ఇలా..
40 మైక్రాన్ల ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించాలి. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లను, చేతిసంచులను నిషేదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ నష్టాలు
ప్లాస్టిక్‌ కవర్లు భూమి లోపల పొరల్లోని మట్టిలో పూర్తిగా కలిసిపోవడానికి వందల ఏళ్లు సమయం పడుతుంది. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకదు. కవర్లను కరిగించే సమయంలో వాటిలో ఉండే రసాయనాలు భూగర్భజలాలను, పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. భూగర్భ జలమట్టం అభివద్ధి చెందడానికి అవకాశం ఉండదు. కవర్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినడం ద్వారా శరీరంలోకి పాలివినైక్‌ క్లోరైడ్‌ రసాయనం చేరి జన్యులోపాలు, కాలేయ వ్యాధులు, అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.
నిషేధాన్ని అమలు చేయాలి
అన్ని హోటళ్లు, చిల్లర అంగళ్లలో అధికారులు ప్లాస్టిక్‌ కవర్లు వాడకుండా చర్యలు తీసుకోవాలి. హోటళ్లలో ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తుండడంతో కేన్సర్‌ వ్యాప్తి చెందుతుందని తెలిసినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా పాస్టిక్‌ కవర్లను ఉపయోగిస్తున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లపై చాలా చోట్ల నిషేధం ఉన్నా పటిష్టంగా అమలుకావడం లేదు. ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం తేవాలి.