ప్రజాశక్తి-అమలాపురం రూరల్
గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమలాపురం రూరల్ మండలం కామనగరువు నల్లా సత్యనారాయణ లే అవుట్‌లో వేదాంత సిఎస్‌ఆర్ నిధులతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి కామనగరువు సర్పంచ్, సర్పంచుల సమైక్య అధ్యక్షురాలు నక్కా అరుణకుమారి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని అన్నారు. రూ.38.5 లక్షల అంచనా వ్యయంతో ఈ వాటర్ ట్యాంక్ ను నిర్మించనున్నట్లు సర్పంచ్ అరుణ కుమారి తెలిపారు. దీంతో ప్రజలందరకు శుద్ధ జలం అందుబాటులోకి వస్తుందని అన్నారు. వాటర్ ట్యాంక్ ను త్వరితగతిన పూర్తి చేయాలంటే అందరి సహాయ సహకారాలు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీ హరి రాంగోపాల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంగెటి డోలా మణి, ఎంపిటిసి సభ్యురాలు మెండు గంగాభవాని, ఉపసర్పంచ్ రాజలపూడి భాస్కరరావు, వార్డు సభ్యులు, నడిపూడి సర్పంచ్ చెల్లిబోయిన నాని, తాండవపల్లి సర్పంచ్ ఏసుబాబు, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










