ప్రజాశక్తి-అమలాపురం
కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపుచేయడంలో ఘోరంగా విఫలమైం దని సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు రాష్ట్రంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. అధిక ధరలు , విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగం సంబంధించిన నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట పార్టీ సభ్యులతో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నులు భారాన్ని మోపుతున్నదన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసి ఆదాయాలు రాబడుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, కరెంట్ చార్జీలు తగ్గించాలని మార్సిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజలను పీడిస్తున్న అధిక ధరలు రోజురోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు హద్దు అదుపు లేకుండా ఆకాశాన్నంటుతున్నాయని పేదలు, మధ్యతరగతి ప్రజానీకం ధరల కోరల్లో చిక్కుకు పోతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలంతా ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేస్తున్న పన్నుల భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. మోడీ భజనలో తరిస్తున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తానని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని గాలికి వదిలేసి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు ఎఫ్‌పిపిసిసిఎ పేరుతో నెలవారీ అదనపు ఛార్జీలు వడ్డిస్తున్నారు.ట్రూ అప్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, ఫిక్స్ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మొదలగు పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై రుద్దారని ఈ ఒక్క సంవత్సరమే దాదాపు రూ.4 వేల కోట్లకుఉ పైగా ప్రజల నుండిఛార్జీల రూపంలో పిండుతున్నారని అన్నారు. దీనితో పేదలు, మధ్యతరగతి ప్రజలు విద్యుత్ చార్జీలు చూసి బెంబేలెత్తుతున్నారని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఇదిపెనుభారమ వుతుందని దీనికితోడు ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెడతామంటూ ప్రజలకు షాక్ ఇస్తోందని విద్యుత్తు కొనుగోలులో ప్రైవేటు కంపెనీలకు అదనపు ధర ఇచ్చి ఆ భారాన్ని వినియోగదారులపై మోపడం అత్యంత దుర్మార్గం అని దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి ఆచరణలో అనేక సాకులు చూపుతూ ఉచిత విద్యుత్తుకు ఎగనామం పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు.
కదలి రండి.. భారాలపై ఉద్యమిద్దాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు ప్రజలు ఆందోళనకు సిద్ధపడాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తోందని సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు అన్నారు. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు వివిధ రూపాల్లో ఆందోళనకు సిపిఎం పిలుపునిచ్చిందని ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని ఆయన అన్నారు. సెప్టెంబరు 3న విరుద్యోగులతో సమావేశం, సెప్టెంబరు 4న మండల కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 30, 31 - సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1 న సచివాలయాలకు అర్జీలు అందజేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బలరాం,దుర్గాప్రసాద్, సఖిలే సూర్యనారాయణ పాల్గొన్నారు.










