Sep 14,2023 18:22

ప్రజాశక్తి-ఆత్రేయపురం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐడి ఎఎస్‌పి ఎం.కృష్ణమూర్తి అన్నారు. గురువారం పేరవరం గ్రామంలోని ఎస్‌వి ఫంక్షన్‌ హాల్‌ నందు ఆయన అధ్యక్షతన ఎస్‌సి, ఎస్‌టి సాధికారత మరియు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టంపై అవగాహనా సదస్సును ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర నేర పరిశోధన విభాగం లోని పౌర హక్కుల రక్షణ సెల్‌ మరియు పోలీసు విభాగం సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్‌సి కమీషన్‌ సభ్యులు చెల్లం ఆనంద్‌ ప్రకాష్‌, సీఐడీ విభాగం స్టాండింగ్‌ కౌన్సిల్‌ మరియు స్పెషల్‌ పీపీ సోమసాని ఝాన్సీ లక్ష్మీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి చట్టాల అవగాహన కొరకు ఇలాంటి సదస్సులు నిర్వహించడం చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మండల స్థాయి, డివిజన్‌ స్థాయి, జిల్లా స్థాయి విజిలెన్స్‌ మరియు మోనిటరింగ్‌ కమిటీలు సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి నెలా 30న అన్ని మండలాలలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలన్నారు. అవగాహనా సదస్సు అనంతరం ఆన్లైన్‌ పరీక్ష నిర్వహించి, విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు బోనం సాయిబాబా, ఆప్కాస్‌ డైరెక్టర్‌ కప్పల శ్రీధర్‌, ఎంపిడిఒ నాతి బుజ్జి, సిఐ ఎన్‌.రజనీ కుమార్‌, తహశీల్దార్‌ డివిఎన్‌ అనిల్‌ కుమార్‌, సిఐడి ఎస్‌ఐ పి.జేమ్స్‌, స్థానిక ఎస్‌ఐ బి.కిరణ్‌ కుమార్‌, సర్పంచ్‌ గంటి విజయభారతి, కొల్లి శ్యామ్‌, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్‌ కనుమూరి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు