Jul 24,2023 23:29

ప్రజాశక్తి మండపేట, రామచంద్రపురం మండపేట-తాపేశ్వరం రోడ్డు పనులు కొద్ది కాలంగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సిసి రోడ్డు నిర్మించి రెండోవైపు వదిలేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల్లో పడి తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు ఎర్ర కంకర పోసి చేతులు దులుపుకున్నారు. నాలుగు రోజుల నుంచి వర్షం విరివిగా కురుస్తున్న నేపథ్యంలో గోతుల్లో నీరు చేరి రోడ్డు అంతా బురద మయంగా మారడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. పలువురు వాహనదారులు వర్షం కారణంగా జారిపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. స్థానిక మెహర్‌ బాబా ఆశ్రమం వద్ద రోడ్డు చెరువును తలపిస్తోంది. అధికారులు స్పందించి త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. రామచంద్రపురంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మెయిన్‌ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఐదేళ్లుగా పాడైన రోడ్లు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రాత్రి సమయంలో పలు ప్రమాదాలకు రోడ్లు కారణమవుతున్నాయి. ఐదేళ్లుగా ఈ రోడ్లు ఆధునికీరణకు నోచు కోకపోవడంతో పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. ముగ్గురు నాయకులు ఉన్న నియోజకవర్గంలో మంత్రి వేణు సొంత నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ద్రాక్షారామ రామచంద్రపురం రోడ్డు, యానాం ద్రాక్షారామ రోడ్డు, వెల్ల ఆదివారం పేట రోడ్డు, శివల దంగేరు మెయిన్‌ రోడ్లు పూర్తిగా పాడై ప్రతిరోజూ పలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ద్రాక్షారామ రామచంద్రపురం రోడ్డుకు సుమారు రూ.15 కోట్లు మంజూరయ్యాయని ఈ రోడ్డు పనులను మార్చి నెలలో మంత్రి వేణు అట్టహాసంగా ప్రారంభించారు. అయినా రోడ్డు పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ద్రాక్షారామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఉండటంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు నిత్యం వస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి ఎప్పటికీ బాగవుతుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.