Jul 20,2023 23:16

లంక గ్రామాలలో నీట మునిగిన వ్యాపార సముదాయాలు ( ఫైల్‌ ఫొటో)

ప్రజాశక్తి-మామిడికుదురు
గోదావరి ఎర్ర నీరు వచ్చిందంటే లంక గ్రామాల తీర ప్రాంతాల ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. గడిచిన నాలుగు దశాబ్దాలలో 12 పర్యాయాలు గోదావరి ఉగ్రరూపం లంక గ్రామాల ప్రజలకు రైతులు తీరని నష్టాలు గురిచేశాయి. వరదలవల్ల వందలాది ఎకరాల సారవంతమైన లంక భూములు నదీపాతమవుతున్నాయి. వరదల ఉగ్రరూపం దాల్చే సమయంలోనే అధికారులు హడావిడిగా రక్షణ చర్యలు చేపట్టడం పరిపాటిగా మారింది. ముందస్తు చర్యలు కానరావడం లేదు.
వరదొస్తే జిల్లాలో చేతులెత్తేయాల్సిందే
జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. 18 మండలాల పరిధిలో సుమారు 80 నది తీర గ్రామాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఈ గ్రామాలన్నీ నదీపాయలకు ఏటిగట్లకు మధ్యలో ఉన్నాయి. 2022 వరదలలో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో మానేపల్లి, పాసర్లపూడిలంక తదితర ప్రాంతాలలో ఏటి గట్లపై వరద నీరు ప్రవహించింది. అప్పట్లో తగ్గుముఖం పట్టడంతో పెద్ద ముప్పు తప్పింది. జిల్లాకు పార్లమెంటు సభ్యులు, ఏడుగురు ఎంఎల్‌ఎలు, ఇద్దరు ఎంఎల్‌సి, ఒక రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరూ అధికార పార్టీకి చెందిన వారే జనాకర్షణ పథకాలతో ప్రచారాలతో పరిమితమవుతున్నారే తప్ప వరదల సమయంలో లంక గ్రామాల ప్రజల ఇబ్బందులకు గురయ్యే దీర్ఘకాల సమస్యల పరిష్కారంపై దష్టి సారించడం లేదని ఆయా ప్రాంతవాసులు వాపోతున్నారు. ఎన్నికలు సమీపించే సమయంలో దీర్ఘకాల సమస్యల పరిష్కారం పై దష్టి సారిస్తామంటూ మభ్యపరుస్తూ కార్యాచరణపై దష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది
వరద ఉగ్రరూపం దాల్చిందంటే కరకట్ట దిగువ రహదారులు పూర్తిగా నీట మునిగి రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. లంక గ్రామాలకు వెళ్లే రహదారులలో పాటు రేవులలో రోజుల తరబడి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రధాన పాటు రేవులలో 10 అడుగుల ఎత్తులో కాజ్‌ వే నిర్మించాలన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమై కార్యరూపం దాల్చడం లేదు. వరదల సమయంలో బాధితులను పల్లపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా నాటు పడవలే పని చేసేవి. ముందస్తుగా అధికారులు పడవలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసిన వారికి రోజుల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అసహనానికి గురై నావలు తిప్పమని వారు స్పష్టం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
జిల్లాలో 18 మండలాల పరిధిలో అవస్థలు
వరదలు ఉధతి పెరిగితే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. 18 మండలాల పరిధిలో 80 లంక గ్రామాలలో ప్రజలు అంధకారంలో కాలం వెళ్ల దీస్తుంటారు. అదే సమయంలో వరద ఉధతితో కొట్టుకు వచ్చిన విష సర్పాలు నివాసాలలోకి చొరబడి కాటు వేయడంతో మత్యువాత పడిన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇంటి చుట్టూ నీరు బయట కాలు పెట్టేందుకు వీలుకాని పరిస్థితి వారికి. అనారోగ్యం వస్తే వైద్య సేవలు అందం నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే కరకట్ట ఎగువ ప్రాంతాలకు వరద నీటిలో వెళ్లాల్సిందే. ఇదే అదునుగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచేస్తుంటారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
ఏటా వరదల సీజన్‌ రావడం పరిపాటే. జూలై నుంచి సెప్టెంబర్‌ నెల వరకు వరదల సీజన్‌ ఉంటుంది. జిల్లాలో వరదలలో రక్షణ చర్యలకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలి.