Sep 03,2023 23:11

ప్రజాశక్తి-రాజోలు
అణువణువూ ప్రకృతి రమణీయతకు నెలవైన 'కోనసీమ' ఆక్వాఃసాగు, చమురు సంస్థల సహజ సంపద వెలికితీత కార్యకలాపాలు, సముద్ర, గోదావరి తీరాల్లో ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు పాడై జలవనరులు తగ్గిపోతున్నాయి. ఇప్పుడవి ఉప్పు మాయమవుతున్నాయి.
కోనసీమలో సాగర తీరం వెంట ఒకప్పుడు ఏ గ్రామం వెళ్లినా అక్కడఊరుమ్మడి చెరువులు, బావుల్లోనూ ఆరోగ్యపరమైన తాగు నీరు వచ్చేది. ఇప్పుడు మానవ తప్పిదాల కారణంగా రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామి డికుదురు, పి.గన్నవరం, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోల వరం, అయినవిల్లి మండలాల్లోని సుమారు 130 గ్రామాలు ఉప్పునీటి బారినపడ్డాయి. కోనసీమలో సుమారు 75 గ్రామాల వరకూ ఉప్పునీటి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. 1550.60 చదరపు కి.మీల్లో దాదాపుగా 890 చదరపు కి.మీ విస్తీర్ణానికి ముప్పు వాటిల్లిందని పర్యా వరణ కాలుష్యంపై పరిశోధనలు చేసిన నిపుణులు చెబుతున్నారు.
ఆక్వా చెరువులుగా పంటపొలాలు
ఒకప్పుడు సముద్రం, గోదావరి తీరాలకు 10 కి.మీ వరకూ పంట పొలాలు ఉంటే ఇప్పుడు వాటిని ఆక్వా చెరువులుగా మార్చేశారు. రాజోలు మండలంలోని చింత లపల్లి మధ్యలోనే రొయ్యల చెరువులు విస్తరించాయి. కోనసీమ వ్యాప్తంగా సుమారు 42 వేల ఎకరాల్లో ఆక్వాసాగు జరుగుతుందని అంచనా. వాటిలో 90శాతం చెరువులకు అనుమతులు లేనప్పటికీ అధికారు లెవరూ పట్టించు కోవడం లేదు. పైగా ఆక్వా సాగు మొత్తం రసాయనాల మీదనే నడు స్తోంది. ఫలితంగా సముద్రతీర ప్రాంతాల్లో 130 గ్రామాల్లో తాగునీటి బావుల్లో నీరు ఉప్పగా మారిందని గ్రామస్తులు చెబు తున్నారు.
ఉప్పునీటి వనరులుగా
కోనసీమలో 15 ఏళ్లక్రితం సముద్రతీరం వెంట ఉన్న గ్రామాల్లోని బావుల్లో మంచినీరు లభించేది. ఇప్పుడు తీరానికి 15 నుంచి 25 కి.మీ దూరాల్లో ఉన్న గ్రామాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీటి వనరులుగా మారిపోయాయి. లీటరు తాగునీటిలో 1500 మిల్లీ గ్రాముల కంటే లవణ సాంద్రత ఎక్కువైతే ఆనీరు ఉప్పుగా ఉంటుంది. అదే 2000 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ లవణ సాంధ్రత ఉంటే ఆనీరు వినియోగానికి పనికిరాకుండా పోతోంది. అదే 3 వేల మిల్లీగ్రాముల కంటే లవణ సాంద్రత ఎక్కువ అయితే ఆ భూములు చౌడుబారిన పడతాయని నీటి పరిశోధకులు వై. విజరు తెలిపారు.
కోనసీమలోని సుమారు 275 గ్రామాల్లో వివిధ చమురు సంస్థలు తమ అన్వేషణలు, కార్యకలాపాల పేరుతో భూమిని జల్లెడ పడుతున్నాయి. సాధారణంగా సహజ వనరులను వెలికి తీసిన తర్వాత భూములోకి వేరే ద్రవంతో నింపాలి. దీంతో అక్కడ శూన్యం ఏర్పడదు. ఇటీవల కాలంలో వెలికితీత ముగియగానే ఆ భూగర్భంలోని ప్రాంతాన్ని ఖాళీగానే వదిలేస్తున్నారు. దీంతో భూమికి కొద్దిపాటి అడుగుల లోతులో ఉండే మంచినీటి పొరలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడైతే మంచినీటి పొరలు దెబ్బతింటున్నాయో అప్పుడు ఆ పొరల్లోకి ఉప్పునీరు ఉబుకుతూ వస్తోంది. తద్వారా భూములన్నీ చవుడు బారుతున్నాయి. ఇలాగే కొనసాగితే భూ, జల కాలుష్యం మితిమీరి కోనసీమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే కనిపి స్తున్నాయని కోనసీమ భూగర్భ జలాలపై పరిశోధనలు చేస్తున్న రాజోలు మండలానికి చెందిన రసాయనిక నిపుణులు ఎం.దుర్గా ప్రసాద్‌ తెలుపుతున్నారు.
తరిగిపోతున్న ఇసుక
గోదావరి లంకల్లో గరుకు ఇసుక తిన్నెల వన్నె క్రమక్రమంగా తగ్గిపోతోంది. కొందరు అక్ర మార్కులు తీరంలోని ఇసుకను తవ్వుకు పోతున్నారు. ఈ కారణంగా భూగర్భ జలాలను కాపాడే ఇసుక తరిగిపోతోంది. ఆ ప్రాంతాల్లోకి ఉప్పునీరు చొచ్చుకుపోతుంది. సముద్ర తీరంలో సుమారు 50 మీటర్ల ఎత్తు ఉన్న ఇసుక తిన్నెలు అక్రమ తవ్వకాలతో 60 మీటర్ల లోతు పారుతున్నాయి. తాగునీటి వనరులు ఉప్పుగా మారుతున్నాయి.